ఈ వారం వార్తల్లో నిలిచిన వ్యక్తుల్లో ప్రముఖులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగాం సురేష్. రాజధాని అమరావతి ప్రాంతంలో తాను ఓ రోజు కూలీగా ఉండేవాడినని... తనను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్లమెంట్‌కు పంపారని గర్వంగా చెప్పుకుంటారు కూడా. అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన నందిగాం సురేష్... ఎస్సీ రిజర్వుడు స్థానమైన బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. భారీ మెజారిటీతో విజయం సాధించారు. లోక్ సభలో తొలిసారి అడుగు పెట్టారు. అయితే తొలి నుంచి కాస్త వివాదాలతోనే కాలం గడిపారు సురేష్. కొద్ది రోజులు సొంత పార్టీకే చెందిన తాడికొండ శాసన సభ్యురాలు డాక్టర్ ఉండవల్లి శ్రీదేవితో వివాదం నడిచింది. ఒక దశలో వీరిద్దరి పంచాయతీ ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వరకు చేరుకుంది. ఇక కొద్ది రోజులు సొంత నియోజకవర్గం పరిధిలోని నేతలతో కూడా విభేదాలున్నాయి. ఆ తర్వాత... రాజధాని అమరావతి రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి... వారి ఆగ్రహానికి గురయ్యారు కూడా.

ఇక పార్లమెంట్ సమావేశాల సమయంలో వైసీపీ రెబల్ ఎంపీ నరసాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామ కృష్ణంరాజుపై అనుచిత వ్యాఖ్యాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లుగా అప్పులు చేస్తోందని ఆర్ఆర్ఆర్ సభలో ప్రస్తావిస్తున్న సమయంలో... వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ మిథున్ రెడ్డి కల్పించుకుని తప్పుబట్టారు. ఇదే సమయంలో మిథున్ రెడ్డి వెనుక కూర్చున్న నందిగాం సురేష్... తనను బూతులు తిట్టాడంటూ స్పీకర్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా లేఖలు రాశారు ఆర్ఆర్ఆర్. అనరాని మాటలు అన్నాడని... తనను చంపుతానంటూ బెదిరించినట్లు కూడా ఆరోపించారు. ఓ వైపు ఈ వివాదం కొనసాగుతున్న సమయంలో ఓ మాజీ ప్రభుత్వ ఉద్యోగిని కులం పేరుతో దుషించాడని... తప్పుడు కేసు పెట్టించి వేధించినట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎస్సీ మాల వర్గానికి చెందిన వ్యక్తిని కులం పేరుతో దూషించి... పోలీసులతో కొట్టించారని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యారు నందిగాం సురేష్.


మరింత సమాచారం తెలుసుకోండి: