తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో నిర్వ‌హించిన‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. డిసెంబ‌ర్ 10న జ‌రిగిన ఎమ్మెల్సీ పోలింగ్ ఓట్ల లెక్కింపు కోసం అధికారులు  ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్ల‌ను సిద్ధం చేసారు.  ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానున్న‌ది.  ఉమ్మడి ఖమ్మం, నల్గొండ,  మెదక్‌,  జిల్లాల‌తో పాటు కరీంనగర్‌ జిల్లాలో జ‌రిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఐదుచోట్ల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతుంది ఇవాళ‌. ముఖ్యంగా క‌రీంన‌గ‌ర్ నుంచి అధికార  పార్టీ టీఆర్ఎస్  అభ్యర్థులు ఎల్ రమణ, భాను ప్రసాదరావు, స్వతంత్ర అభ్యర్థిగా కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఈ ఎన్నికల్లో పోటీ చేసారు. రవీందర్ సింగ్ సాధించే ఓట్లపై అంద‌రి దృష్టి నెల‌కొంది.

ఆయా జిల్లా కేంద్రాల‌లో కౌంటింగ్  ఉద‌యం 8 గంట‌ల నుంచి మొద‌లై మ‌ధ్యాహ్నం లోపే ఫ‌లితం రానున్న‌ది. ముఖ్యంగా క‌రీంన‌గ‌ర్ జిల్లాలో 9 టేబుళ్లు.. ఆదిలాబాద్‌లో 6, మిగ‌తా చోట్ల ఐదు టేబుళ్ల‌ను ఏర్పాటు చేసారు అధికారులు. కరీంనగర్‌ జిల్లా ఎమ్మెల్సీకి సంబంధించి కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ క‌ళాశాల‌లో ఎన్నిక‌ల  కౌంటింగ్ జరగనుంది. జిల్లాలో మొత్తం 1,324 ఓట్ల‌కు ఇక్క‌డ 1,320 ఓట్లు పోల‌య్యాయి. దాదాపు 99.70 శాతం  పోలింగ్  అత్యంత ఎక్కువ‌గా ఇక్క‌డే న‌మోద‌వ్వ‌డం గ‌మ‌నార్హం.

క‌రీంన‌గ‌ర్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌లో కేసీఆర్ అక్క‌డి స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు  షాక్ ఇవ్వ‌నున్నార‌ని.. ఆ స్థానం చేజారే అవ‌కాశం ఉన్న‌ద‌ని టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా  స్వ‌తంత్ర అభ్య‌ర్థులు ర‌వీంద‌ర్‌సింగ్‌, ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు ప్ర‌భాక‌ర్‌రెడ్డి మ‌ధ్య ప్ర‌ధాన పోటీ నెల‌కొన్న‌ది. మొత్తం 10 మంది అభ్య‌ర్థులు బరిలో నిల‌వ‌గా.. ఇక్క‌డ 33 శాతం ఓట్లు వ‌చ్చిన అభ్య‌ర్థిని విజేత‌గా ప్ర‌క‌టిస్తారు. తొలి ప్రాధాన్య‌త ఓట్ల‌తో విజేత తేల‌క‌పోతే, రెండో ప్రాధాన్య‌త ఓట్లను లెక్కిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కౌంటింగ్ నిర్వ‌హించ‌నుండ‌డంతో ఎస్ఆర్ఆర్ డిగ్రీ క‌ళాశాల ఆవ‌ర‌ణ‌లో పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేసారు.

ఇటీవ‌ల  జ‌రిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో అంద‌రి దృష్టి ఏవిధంగా ఉన్న‌దో.. ఇప్పుడు క‌రీంన‌గ‌ర్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాల కోసం కూడా తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌లు అదేవిధంగా ఎదురుచూస్తూ ఉన్నారు. క‌రీంన‌గ‌ర్ మాజీ మేయ‌ర్ ర‌వీద‌ర్‌సింగ్ కు బీజేపీ మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో ఇక్క‌డ ఆయ‌న గెల‌వ‌నున్నార‌నే టాక్ వినిపిస్తోంది. మ‌రోవైపు స‌ర్దార్ ర‌వీంద‌ర్ సింగ్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెలిస్తే క‌రీంన‌గ‌ర్ మేయ‌ర్ ప‌ద‌వీకి రాజీనామా చేస్తాను అని మేయర్‌ వై సునీల్‌రావు పేర్కొంటున్నారు. బీజేపీ నేత‌లు మాత్రం కరీంన‌గ‌ర్‌లో టీఆర్ఎస్ ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. క‌రీంన‌గ‌ర్‌లో టీఆర్ఎస్ గెలుస్తుందా.. లేక బీజేపీ మ‌ద్ద‌తు తెలిపిన స్వ‌తంత్ర అభ్య‌ర్థి గెలుస్తాడో ఇవాళ మ‌ధ్యాహ్నం వ‌ర‌కు తేల‌నుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: