తెలంగాణలో అధికారంలో ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీ కు ఇప్పుడిప్పుడే డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. సొంత పార్టీలోనే తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతోంది. స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కేడర్ ఆ పార్టీ ప్రజాప్రతినిధుల‌ లో ఎంత అసంతృప్తి ఉందో రుజువు చేస్తోంది. పార్టీలో వర్గ పోరు పార్టీ పరువును బజారుకు ఈడ్చేసింది. పార్టీ నేతల మధ్య గొడవలు... రాష్ట్ర నాయకత్వం పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు టిఆర్ఎస్ పార్టీ ఓట్లు భారీగా క్రాస్ అవ్వ‌డం.. ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.

ఖమ్మం జిల్లాలో తొలి నుంచి కూడా టిఆర్ఎస్ బలంగా లేదు. 2014 ఎన్నికల్లో అక్కడ వైసిపి - టిడిపి సత్తా చాటాయి. ఖమ్మం ఎంపీ కూడా వైసీపీ ఖాతాలో పడింది. ఆ తర్వాత కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ నేపథ్యంలో ఇతర పార్టీలకు చెందిన నేతలకు పదవులు ఇచ్చి గులాబీ కండువాలు కప్పి చేశారు. ఆ తర్వాత టిఆర్ఎస్ కొద్దిగా బలపడింది. 2018 లో జరిగిన ముందస్తు ఎన్నికల్లోనూ ఒక్క ఖమ్మం ఎమ్మెల్యే సీటు మినహా జిల్లాలో అన్ని సీట్లలోనూ మహా కూటమి అభ్యర్థులు గెలుచుకున్నారు. వైరాలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు.

ఆ తర్వాత కేసీఆర్ మరోసారి కేసీఆర్ ఆపరేషన్ ఆక‌ర్ష్ తో ఇతర పార్టీల‌ లో గెలిచిన ఎమ్మెల్యేల‌కు కూడా గులాబీ కండువాలు వేశారు. అదే ఇప్పుడు పార్టీకి శాపంగా మారింది. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 738 ఓట్లు ఉండగా టీఆర్ఎస్ కు 480 - కాంగ్రెస్ కు 242 ఓట్లు వచ్చాయి. వాస్త‌వానికి కాంగ్రెస్ కు అక్కడ 96 ఓట్లు ఉంటే ఏకంగా ఆ పార్టీ అభ్య‌ర్థికి 242 ఓట్లు వ‌చ్చాయి. అంటే 150 ఓట్లు క్రాస్ అయ్యాయి. ఈ ఓట్లు అన్ని ఎక్కువుగా కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతాల నుంచే క్రాస్ అయినట్లు పార్టీ నేత‌ల్లో సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి.

పార్టీలో అసంతృప్తి గా ఉన్న కొత్త‌గూడెం మాజీ ఎమ్మెల్యే జ‌ల‌గం వెంక‌ట‌రావు, ఖ‌మ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్ద‌రూ కూడా త‌మ వ‌ర్గం ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో ఈ క్రాస్ ఓటింగ్ కు పాల్ప‌డిన‌ట్టు చెపుతున్నారు. ఇక తాతా మ‌ధు కూడా ఈ క్రాస్ ఓటింగ్ పై అధిష్టానానికి ఫిర్యాదు చేయ‌నున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: