చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజాకు ఇప్పుడు సొంత పార్టీలోనే ప్రత్య‌ర్థులు ఎక్కువైపోయారు. 2014 , 2019 ఎన్నికల్లో కాలం కలిసి వచ్చి స్వల్ప మెజార్టీతో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా రెండోసారి ఎమ్మెల్యే అయ్యాక నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలను పక్కనపెట్టి దూకుడుగా వెళుతున్నారు అన్న చర్చ అయితే ఉంది. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గంలో ఆమెకు వైసీపీలోనే బలమైన వ్యతిరేక వర్గాలు ఏర్పడ్డాయి. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు కూడా రోజాకు తెలియకుండానే ఆమె నియోజకవర్గంలో చాపకింద నీరులా ప్రణాళికలు రచిస్తున్నారు అన్న టాక్‌ బలంగా వినిపిస్తోంది.

రోజా కూడా గ‌తంలో ఈ ఇద్ద‌రు మంత్రుల తీరుపై ఓపెన్‌గానే ఫైర్ అయిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి.రోజా ఇప్పుడు అక్కడ టిడిపి నేతలతో పోరాడాల్సిన అవసరం లేదు... సొంత పార్టీలోని అసమ్మతి నేతలతోనే పెద్ద యుద్ధం చేయాల్సి వస్తోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ రోజా కు వ్యతిరేకంగా బలంగా ఉన్న అసమ్మతి వర్గం పని చేసింది. ఈడీగ  కార్పొరేషన్ చైర్మన్ కెజె. శాంతి ఆమె భర్త కెజె. కుమార్ నియోజకవర్గంలో రోజా అసమ్మతి వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు.

ఇక జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం నగరిలో అసమ్మతి నేతలు అండగా ఉంటున్నారని ప్రచారం కూడా జరుగుతోంది. రోజాకు ఎలాగైనా చెక్ పెట్టాలని వీరంతా చాపకింద నీరులా పావులు కదుపుతున్నారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో రోజా ప‌ద‌వులు అన్ని త‌న‌కు కావాల్సిన వారికే ఇప్పించుకోవ‌డం కూడా అస‌మ్మ‌తి నేత‌ల‌కు రుచించ‌డం లేదు. దీంతో వారంతా 2024 ఎన్నిక‌ల్లో టైం చూసి ఆమెకు దెబ్బ కొట్టాల‌ని క‌సితో ఉన్నారు.

ఇక ఇప్ప‌టి నుంచే రోజాతో సంబంధం లేకుండా నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ కార్య‌క్ర‌మాలు కూడా చేప‌ట్టేందుకు రెడీ అవుతున్నారు. అందుకు సీఎం జ‌గ‌న్ పుట్టిన రోజునే వారు వాడుకుంటున్నారు.ఈ నెల 21వ తేదీన సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజును రోజాతో సంబంధం లేకుండా అసమ్మతి వర్గం అంతా భారీ ఎత్తున నిర్వహించాలని చేస్తున్నారు.

తాము ఎప్పటి నుంచో పార్టీకోసం పనిచేస్తున్నా.. రోజా తనకంటూ ఒక సొంత వ‌ర్గాన్ని ఏర్పాటు చేసుకుని ... వారికి సపోర్ట్ చేస్తూ నియోజకవర్గంలో పార్టీని సర్వనాశనం చేస్తున్నారని పార్టీ నేత‌లు ఫైర్ అవుతున్నారు. తాము కష్టపడ‌కపోతే... ఆమె రెండు సార్లు స్వల్ప మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచేదా ? అని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా నగరి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో టిడిపి వాళ్ళు రోజాను ఓడించాల్సిన  అవసరం లేదనిపిస్తుంది. సొంతపార్టీ నేతలే ఆమెను చిత్తు చిత్తుగా ఓడించే వాతావరణమే అక్కడ ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: