గత ఎన్నికల ముందు వరకు నారా లోకేష్ రాజకీయం వేరు....ఎన్నికల తర్వాత నుంచి రాజకీయం వేరు అని చెప్పొచ్చు. ఎందుకంటే రాజకీయంగా ఆ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఓటమి నాయకుల జీవితాలని మార్చేస్తుందనే చెప్పాలి. ఇప్పుడు లోకేష్‌ని కూడా ఓటమి మార్చిందనే చెప్పాలి. సరిగ్గా గత ఎన్నికల ముందు పరిస్తితిని ఒక్కసారి చూస్తే..టీడీపీ అధికారంలో ఉంది...అలాగే చంద్రబాబు సీఎం..దీంతో లోకేష్‌కు పదవులు అలా వచ్చి పడ్డాయి. ఎమ్మెల్సీ...ఆ వెంటనే మంత్రి. అంటే కష్టపడకుండానే పదవులు వచ్చాయి.

అయితే కష్టపడకుండా వచ్చిన పదవులు ఎక్కువ కాలం నిలబడవనే చెప్పాలి. ఇది లోకేష్‌ విషయంలో బాగా రుజువైంది. ప్రజల నుంచి గెలవకుండా..అధికారంతో పదవులు దక్కించుకుంటే ఏం అవుతుందో గత ఎన్నికల్లో లోకేష్‌కు బాగా కనిపించింది. తొలిసారి పోటీలో దిగి ఘోరంగా ఓడిపోయారు..అటు పార్టీ కూడా ఘోరంగా ఓడిపోయింది...ఇక ఇక్కడ నుంచే లోకేష్‌లో మార్పు మొదలైందనే విషయం తెలిసిందే. పైగా ప్రత్యర్ధులు ఎక్కడకక్కడ ఎగతాళి చేస్తూ రావడంతో లోకేష్‌లో బాగా మార్పు వచ్చింది.


ఆ మార్పు ఎలాంటిదో ఇప్పుడు స్పష్టంగానే కనబడుతోంది...ప్రత్యర్ధులపై దూకుడుగా విమర్శలు చేయడం..ప్రజల మధ్యలోకి వెళ్ళిపోయి...ప్రజలకు దగ్గరవ్వడం లాంటి కార్యక్రమాలు లోకేష్ ఎక్కువగానే చేస్తున్నారు. అలాగే ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలనే అంశాన్ని కూడా లోకేష్ బాగా నేర్చుకున్నట్లు కనిపిస్తోంది. అవసరమైనప్పుడు ప్రత్యర్ధులని కూడా చిరునవ్వుతో పలకరించాలనే ఫార్ములాని బాగా తెలుసుకున్నారు. అందుకే ఇప్పుడు లోకేష్‌కు మంగళగిరిలో మద్ధతు పెరుగుతుంది. ఆ విషయం స్పష్టంగానే తెలుస్తోంది.

పైగా ఎన్నికలకు ఇంకా రెండున్నర ఏళ్ళు సమయం ఉండగానే..లోకేష్ మంగళగిరి ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. అక్కడ ఉన్న ప్రత్యర్ధి పార్టీలకు చెందిన ఓటర్లని సైతం ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఊహించని విధంగా జనసేన నేతలతో కూడా సఖ్యతతో మెలుగుతున్నారు. అంటే జనసేన సపోర్ట్ ఉంటే తన గెలుపు సులువు అని తెలుసుకున్నారు. ఇలా రాజకీయంగా బాగా అవగాహన పెంచుకుని..ప్రత్యర్ధులని కూడా ఆకట్టుకుంటూ..మామూలోడు కాదని అనిపించుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: