తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ గా రేవంత్ పగ్గాలు చేపట్టిన తర్వాత అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ దూకుడు చూపుతోంది. ఇదే సమయంలో ఉప ఎన్నికల్లో గెలిస్తూ టీఆర్ఎస్ కు తామే ప్రత్యర్థి అనే విధంగా బీజేపీ ముందుకు వెళుతుంది. ఇక బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ సీఎం కేసీఆర్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇక రేవంత్ కాంగ్రెస్ ను వీడి ముందుగా టిఆర్ఎస్ లో చేరిన వారిని తిరిగి సొంత గూటికి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి డి. శ్రీనివాస్ తో కొద్ది నెలల క్రితం సమావేశమయ్యారు.

కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించారు. ఇక హుజురాబాద్ బైపోల్ లో గెలిచిన తర్వాత ఈటెల రాజేందర్ సైతం డి.శ్రీనివాస్ తో సమావేశమయ్యారు. డి.శ్రీనివాస్ కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ లో చేరిన తర్వాత ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా కేసీఆర్ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు డి. శ్రీనివాస్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తో భేటీ అయ్యారు. తెలంగాణ రాజకీయాలు,కాంగ్రెస్ పరిస్థితి పైన చర్చించారు. డీఎస్ తిరిగి కాంగ్రెస్ లోకి రావడం ఖాయమయిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో ఉండగా తాజా పరిణామంతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ను ఆగమేఘాల మీద పిలిపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డిఎస్ టిఆర్ఎస్ ఎంపీగా ఉన్నా గులాబీ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఇక సీఎం కేసీఆర్ సైతం డీఎస్ తీరును నిశితంగా గమనిస్తున్నారు. ఎంపీగా మరో ఆరు నెలలు కొనసాగేందుకు డిఎస్ కు అవకాశం ఉంది.

అయితే ఇప్పుడు సోనియాతో సమావేశం కావడం తో టిఆర్ఎస్  ఆయన పైన చర్యలు తీసుకుంటుందా లేక ముందుగానే తన ఎంపీ పదవి తో పాటు టిఆర్ఎస్ కు డిఎస్ రాజీనామా చేస్తారా అనే చర్చ రెండు పార్టీల్లోను కొనసాగుతోంది. అయితే కాంగ్రెస్ లో చేరే అంశంపై మాత్రం డిఎస్ ఓపెన్ గా స్పందించడానికి అంగీకరించలేదు.తాను సోనియాగాంధీని తరచూ కలుస్తూనే ఉంటానని ఆయన అన్నారు. డిఎస్ చేరిక విషయం తనకు తెలియదని ముఖ్య నేతలతో మాట్లాడిన తర్వాత తనని ఎందుకు రమ్మన్నారో చెబుతానని భట్టి విక్రమార్క తెలిపారు. అయితే రేవంత్ వ్యూహం ఫలించి త్వరలో పలువురు కీలక నేతలు హస్తం గూటికి చేరనున్నట్టు ప్రచారం సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: