తెలంగాణలో నామినేటెడ్ పదవుల జాతర మొదలైంది. తెలంగాణ ఉద్యమకారుల నుంచి టిఆర్ఎస్ వెంట ఉన్న వారికి పదవులను కట్టబెడుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రెండు రోజుల వ్యవధిలో ఎనిమిది మందికి కార్పొరేషన్ పదవులను కట్టబెట్టారు . దీంతోపాటు పార్టీలో పదవులు ఆశించి నిరాశ పడ్డ వారికి పదవులు ఇస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నుంచి టిఆర్ఎస్ లో ఉన్నవారికి పదవుల పండగ మొదలైంది. ఇప్పటివరకు పదవులు వచ్చిన వారిలో యువతతో పాటు దళిత సామాజిక  వర్గానికి చెందిన వారికి పదవులు కట్టబెడుతున్నారు.

 గత కొంత కాలం నుంచి టిఆర్ఎస్ లో టిఆర్ఎస్ లో ఉద్యమకారులకు న్యాయం జరగడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శలను తిప్పికొట్టడానికి ఖాళీగా ఉన్న  నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తున్నారు. గత ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సమయంలో అవకాశం కల్పిస్తారని భావించిన వారికి కార్పొరేషన్ పదవులు ఇస్తున్నారు. ఇప్పటికే 8  కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా మన్నే కృషాంక్, తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎర్రోళ్ల శ్రీనివాస్, తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా వేద సాయిచందర్, తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గా గజ్జెల నగేష్, తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ గా పాటిమీది జగన్ మోహన్ రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ గా జూలూరి గౌరీశంకర్ తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాలరాజు యాదవ్ గార్లను సీఎం కేసీఆర్ నియమిస్తారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఎదురుచూస్తున్న వారికి పదవులు కట్టబెడుతున్నారు కెసిఆర్. ఇదే బాటలో చాలామంది ఆశావాహులు ఉన్నారు. ఇతర పార్టీల నుంచి టిఆర్ఎస్ లో చేరిన వాళ్ళు కూడా పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో కార్పొరేషన్ చైర్మన్ లుగా చేసిన వాళ్లు మరోసారి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకో పక్క తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్లు వేరే పార్టీలో చేరే అవకాశం ఉందని,అందుకే టీఆర్ఎస్ లో పదవుల జాతర మొదలైందని విమర్శలు వస్తున్నాయి. కానీ టిఆర్ఎస్ జెండాను మోస్తున్న వారిని గుర్తించి పదవులు ఇవ్వాలని కోరుతున్నారు ఉద్యమ నాయకులు. నామినేటెడ్ పదవుల కోసం ఎవరి లాబీయింగ్ లో వారున్నారు. జిల్లా నేతలతో నిత్యం టచ్ లో ఉంటున్నారు ఆశావాహులు. ఇప్పటికే 8 పదవులను కట్టబెట్టారు కాబట్టి మిగతా వాటిలోనైనా తమకు న్యాయం జరిగేలా చూడాలని నేతలకు మొర పెట్టుకుంటున్నారట. అయితే  తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో అసువులు బాసి, ఉద్యమానికి ఊపిరి పోసిన విద్యార్థులు ప్రస్తుతం రోడ్ల పాలయ్యారు.

నాయకులకు నాలుగు రోజులు పదవులు లేకుంటేనే అంత ఇబ్బందిగా ఉంటే, డిగ్రీలు,  పీజీలు చేసి సంవత్సరాల కాలంగా కోచింగులు తీసుకొని ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నా నిరుద్యోగుల పరిస్థితి ఏంటని వారంటున్నారు. చదివిన చదువులకు ఉద్యోగాలు లేక, కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేక ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకెంతో మంది డైలీ వారి లేబర్ కూలీలుగా పనులకు వెళ్తున్నారు. వారికి ఏమో పదవులు ఇస్తూ, మా కొలువులను ఎందుకు మరిచారు ముఖ్యమంత్రి గారు అంటూ విద్యార్థిలోకం ఆవేదన వ్యక్తం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: