గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్‌ రాజకీయ నాయకుడు, వైసీపీ నేత, మాజీ మంత్రి, ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు మోపిదే వెంకటరమణ.. తన రాజకీయ వారసుడుని తెరపైకి తెచ్చారు. ఇటీవల మోపిదేవి వెంకటరమణ కుమారుడు రాజీవ్‌ జన్మదినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మోపిదేవి రాజకీయ వారసుడిని ప్రకటించడం చర్చకు దారితీసింది. అది కూడా మోపిదేవి వెంకటరమణ తమ్ముడు మోపిదేవి హరనాథబాబు ఆ ప్రకటన చేయడం పలు రకాల చర్చకు దారితీసింది. ఎందుకంటే- మోపిదేవి వెంకటరమణ ఏ పదవిలో ఉన్నా.. ఆయన తమ్ముడు హరనాథబాబు అన్నీ తానై నియోజకవర్గంలో వ్యవహారాలు నడిపిస్తుంటారు. అన్న తర్వాత తమ్ముడు హరనాథబాబు రేపల్లె నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశముందని కింది స్థాయి క్యాడర్‌ నుంచి నాయకుల వరకు అందరూ భావించారు. అలాంటిది హరనాథబాబే తన అన్న కుమారుడు రాజీవ్‌ను మోపిదేవి వారసుడుగా ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

నిజానికి మోపిదేవి వెంకటరమణ వై.ఎస్.కుటుంబానికి సన్నిహితుడు. రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్‌ చేతిలో ఆయన రెండు సార్లు ఓటమి చెందారు. అయినప్పటికీ వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి.. మోపిదేవి వెంకటరమణకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. తర్వాత ఆయన్ను మంత్రి పదవి నుంచి తప్పించి రాజ్యసభకు పంపారు. ఈ పరిణామాలతో ఇక మోపిదేవికి ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉండదని పార్టీ వర్గాలు భావించాయి. ఇక ఇదే సమయంలో రేపల్లె ఎమ్మెల్యే సీటు వేరే వారికి పోతుందని ఆయన గ్రహించారనీ, అందుకే ముందస్తుగా తన కుమారుడు రాజీవ్‌ను రాజకీయ రంగ ప్రవేశం చేయించే పనిలో పడ్డారనీ చర్చ జరుగుతోంది. ఇందుకు కుమారుడి జన్మదిన వేడుకను వేదికగా చేసుకున్నారని వినికిడి.
అయితే అన్న తర్వాత తానేనని మోపిదేవి హరనాథబాబు కూడా ఊహల్లో ఉన్నారట. కానీ ఆయన అన్న మోపిదేవి వెంకటరమణ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ... తన రాజకీయ చతురతను ప్రదర్శించారని, తన తమ్ముడి చేతే తన కుమారుడిని మోపిదేవి వారసుడు అని ప్రకటింపజేశారని రాజకీయ వర్గాల వారు చర్చించుకుంటున్నారు. మొత్తానికి మోపిదేవి వారసత్వ రాజకీయం చేశారని స్వపక్షీయుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: