జైభీమ్ సినిమాలో క‌థానాయ‌కుడి పాత్ర రూపక‌ల్ప‌న‌కు స్ఫూర్తిగా ఆ చిత్ర బృందం పేర్కొన్న జ‌స్టిస్ చంద్ర ఒక్క‌సారిగా అటు త‌మిళ‌నాడుతోపాటు, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ వార్త‌ల్లోని వ్య‌క్తిలా మారిపోయిన విష‌యం తెలిసిందే. ఇప్పుడాయ‌న  తెలుగు రాష్ట్రాల్లో వివాదాల‌కూ కేంద్ర బిందువుగా మారుతున్నారు. పేద‌ల‌కు న్యాయం జ‌రగ‌డం కోసం పోరాటం చేసిన రియ‌ల్‌ హీరోగా  కీర్తిస్తూ  జ‌స్టిస్ చంద్రుకు మీడియా విస్తృత స్థాయిలో ప్ర‌చారం క‌ల్పించింది. అయితే ఆ త‌రువాత‌  ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు తీర్పుల‌పై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌తో ఆయ‌న‌పై ఇప్పుడు వివాదాలు ముసురుకుంటున్నాయి. ఏపీలో ప్ర‌భుత్వం స్వేచ్ఛ‌గా ప‌ని చేసేందుకు వీలు లేకుండా హైకోర్టు తీర్పులు అడ్డంకులు క‌లిగిస్తున్నాయ‌నే భావంతో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లపై ఉన్న‌త న్యాయ‌స్థానం కూడా తీవ్రంగానే మండిప‌డింది. ప్ర‌జ‌ల హ‌క్కుల ర‌క్ష‌ణ కోసం ప్ర‌య‌త్నించే కోర్టు తీర్పుల‌కు దురుద్దేశాల‌ను ఆపాదించ‌డం స‌రికాద‌ని  ఆయ‌నకు గట్టి స‌మాధానం ఇచ్చింది. న్యాయ‌మూర్తుల‌ను నిందించిన కొంత‌మంది వ్య‌క్తులకు సంబంధించిన కేసుల ద‌ర్యాప్తును హైకోర్డు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐకి అప్ప‌గించడాన్నికూడా  ఈ మాజీ న్యాయమూర్తి త‌ప్పు ప‌ట్టిన విష‌యం తెలిసిందే.

          ఇదిలా ఉండ‌గా తాను చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆదివారం విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు జ‌స్టిస్ చంద్రు మ‌రోసారి స్పందించారు. త‌న వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఏపీ రాజ‌ధాని అంశంలో హైకోర్టు.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వాసుల అభిప్రాయాల‌నూ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని స‌మ‌న్యాయం అందించాల‌ని మాత్ర‌మే అన్నాన‌ని ఆయ‌న తెలిపారు. కొంద‌రు విమ‌ర్శిస్తున్న‌ట్టుగా తాను ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప‌క్ష‌మో లేక చంద్ర‌బాబునాయుడు ప‌క్ష‌మో కాద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఆర్టీసీ కార్మికుల స‌మ్మె విష‌యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తీరునూ ఆయ‌న త‌ప్పుప‌ట్టారు. కార్మికులు హ‌క్కుల కోసం పోరాడుతున్న‌ప్పుడు ముఖ్య‌మంత్రి కేసీఆర్ వారిని భ‌య‌పెట్టేలా వ్య‌వ‌హ‌రించడం ప్ర‌జాస్వామ్యానికి విఘాత‌మంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి సూటిగానే త‌గిలాయి. ఇదే సంద‌ర్భంగా దేశంలోని సినిమా సెన్సార్ బోర్డుల‌న్నీబీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుకూల వ‌ర్గాల‌తో నిండిపోయాయంటూ కూడా జ‌స్టిస్ చంద్రు వ్యాఖ్యానించారు. దీంతో ఈయ‌న వ్యాఖ్య‌ల‌పై దుమారం చెల‌రేగే అవ‌కాశం క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: