టీడీపీలో కొత్త ర‌క్తం నింపేందుకు చాలా ప్ర‌యత్నాలు చేస్తున్నారు చంద్ర‌బాబు. ఈ క్ర‌మంలో జిల్లాల‌లో ఉన్న యువ‌త‌ను కో ఆర్డినేట్ చేసుకుని పార్టీలో వారితో ప‌నిచేయించేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. కానీ చంద్ర‌బాబు ప‌రుగులు తీసినంతగా ఇత‌రులెవ్వ‌రూ ఆయ‌న‌కు సహ‌కారం కానీ స‌మ‌న్వయం కానీ అందించ‌క‌పోవ‌డ‌మే విచార‌కరం. అంతేకాదు నియోజ‌క‌వ‌ర్గాల వారీగా కొత్త ముఖాలేవీ తెర‌పైకి రాక‌పోవ‌డం కూడా ఓ విధంగా పార్టీకి క‌లిసిరాని విష‌య‌మే. ఉన్న కొద్దిపాటి వ్య‌క్తులే అంతో ఇంతో పార్టీకి స‌హ‌కారం అందిస్తున్నారు. శ్రీ‌కాకుళంలో రామ్మోహ‌న్ నాయుడు కింజ‌రాపు, మెండ దాసునాయుడు, విజ‌య‌న‌గ‌రంలో కిమిడి నాగార్జున, వేమ‌ల చైత‌న్య‌బాబు ద్వ‌యాలు బాగా ప‌నిచేస్తున్నాయి.



బాబాయ్ అచ్చెన్న అందించే స్ఫూర్తితో రామూ బాగా ప‌నిచేస్తున్నారు. ముఖ్యంగా వార‌స‌త్వం తో అడుగులు ముందుకు వేసినా ఇప్పుడు త‌న‌కంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నారు. మంచి వ్య‌క్తిత్వం, న‌డ‌వ‌డి, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై సానుకూలంగా స్పందించ‌డం, అలానే పార్టీ చెప్పే ప్ర‌తీ ప‌నినీ బాధ్య‌తాయుతంగా నిర్వ‌ర్తించడం ఆయ‌న‌కు ఉన్న ప్ర‌ధాన ల‌క్ష‌ణాలు. స‌ద్గుణాలు కూడా ఇవే! ముఖ్యంగా ఆయ‌న బాట‌లోనే తెలుగు యువ‌త జిల్లా అధ్య‌క్షులు మెండ దాసు నాయుడు కూడా బాగా ప‌నిచేస్తూ, పార్టీకి జీవం పోస్తున్నారు. ఇక జిల్లాలో ఉన్న తెలుగు మ‌హిళా విభాగ ఇంఛార్జ్ త‌మ్మినేని సుజాత కూడా ప్ర‌తిప‌క్ష నాయ‌కురాలిగా మంచి పోరాట ప‌టిమ చూపుతున్నారు. 



అదేవిధంగా విజ‌య‌న‌గ‌రంలో కూడా కిమిడి నాగార్జున కూడా త‌న బాబాయి కిమిడి క‌ళా వెంక‌ట్రావు స్ఫూర్తిగా బాగా ప‌నిచేస్తున్నారు. ఈయ‌న‌తో పాటు పార్టీ స‌మ‌న్వ‌య బాధ్య‌త‌లు చూస్తూ తెలుగు యువ‌త అధ్య‌క్షులు, విజ‌య‌న‌గ‌రం పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గంకు సంబంధించిన బాధ్యులు  అయిన వేమ‌లి చైత‌న్య బాబు బాగా ప‌నిచేస్తున్నారు. నిబ‌ద్ధ‌త‌తో కూడిన ఈ ద్వ‌యంతో పాటు తెలుగు విద్యార్థి విభాగం టీఎన్ఎస్ఎఫ్ త‌రఫున భాను కూడా బాగా క్షేత్ర స్థాయిలో పార్టీ త‌ర‌ఫున గొంతుక వినిపి స్తున్నారు. ఇక అటు విశాఖ న‌గ‌రంలో పార్టీ త‌ర‌ఫున పెద్గ‌గా కనిపించే ముఖాలు లేకున్నా అయ్య‌న్న పాత్రుడు కొడుకు విజ‌య్ పాత్రుడు బాగానే ప‌నిచేస్తున్నారు. ఉత్త‌రాంధ్ర వ‌ర‌కూ పార్టీకి యువ నాయ‌కులు బాగానే ఉన్నా కూడా మిగిలిన ప్రాంతాల‌లో మాత్రం పెద్ద‌గా యాక్టివ్ మోడ్ లో లేరు. దీంతో పార్టీ చేప‌ట్టే ప‌నులు లేదా నిర‌స‌న‌లు అన్న‌వి దిగువ స్థాయికి చేర‌డం లేదు. లోకేశ్ కూడా యాక్టివ్ అయిన‌ప్ప‌టికీ ఆయ‌న నాయ‌క‌త్వానికి ఇంకా కావాల్సినంత మ‌ద్ద‌తు ద‌క్కాల్సి ఉంది. అప్పుడే టీడీపీకి జ‌వం మ‌రియు జీవం.



మరింత సమాచారం తెలుసుకోండి:

tdp