నెల్లూరు జిల్లా... ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దున ఉండే జిల్లా.. తమిళనాడుకు సమీపాన ఉండటంతో ఇక్కడ మద్రాస్ సంస్కృతి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ జిల్లా నిఘా నీడలో ఉంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ జిల్లా లో జరుగుతున్న వ్యవహారం పై రహస్యంగా విచారణ చేస్తోంది. ముఖ్యంగా రవాణా శాఖ యంత్రాంగం తమ శాఖ పరిధిలో ఏం జరుగుతోందో ఇరవైనాలుగు గంటల్లో తెలపాలని సిబ్బందిని అదేశించింది.
కోవిడ్-19 వ్యాధి ప్రపంచం పై పడగ విప్పిన సమయంలోనూ ఈ జిల్లా రాష్ట్రంలో ఖ్యాతిని సంపాదించుకుంది. కోవిడ్ సమయంలో  స్థిరాస్తుల క్రయవిక్రయాలు జరపడంలో నెల్లూరు జిల్లా రాష్ట్రంలోనే  ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా తడ ప్రాంతంలో జరిన స్థిరాస్థి లావాదేవీలు  యావత్ దేశాన్ని ఆకర్షించాయనడంలో అతిశయోక్తి లేదు. ఎక్కడెక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారులు తడ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టారు.. పెడుతున్నారు కూడా.  ఆనాడు అధికారులు రాష్ట్ర ఖజానాకు పెద్ద మొత్తంలో నిధులు వచ్చి చేరాయని సంతోషించారు. మిగతా విషయాలుఏవీ ఆలోచించ లేదు. ప్రస్తుతం వివిధ శాఖలు  ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించాయి.
గూడూరు, సూళ్లూరు పేట ఆర్టీవో కార్యాలయాల పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకు ప్రత్యేక కారణం ఉంది కూడా. బిఎస్-4 వాహనాల స్థానంలో బిఎస్ -6 వాహనాలు వచ్చాయి.  ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామం.  కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే ఈ మార్పు జరిగింది. అయితే అరుణాచ ల ప్రదేశ్ తో సహా పలు ఈశాన్య రాష్ట్రాలలో బి.ఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్ లారీలు, ట్రక్కులు ఆంధ్ర ప్రదేశ్ కు మారుతున్నాయి. రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ అంతా ఆన్ లైన్  లో నడుస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఉత్తర, ఈశాన్య భారతంలో రాష్ట్రాల వాహనాలు ఆంధ్ర ప్రదేశ్ కు ట్రాన్స్ ఫర్ అవుతున్నాయి. నెల్లూరు జిల్లా అడ్రస్ లో ఈ వాహనాల మార్పు జరుగుతోంది.  ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. వాహనాలు ఏవీ కూడా ఈ జిల్లా లోని కార్యాలయాల్లో నమోదు కావడం లేదు.  గుంటూరు, కృష్ణ తదితర జిల్లాల నుంచి ట్రాన్స్ ఫర్ అప్లికేషన్లు  ఆన్ లైన్ లో  నెల్లూరు జిల్లా అడ్రసుల్లో  నమోదవుతుండగం గమనార్హం.  దీంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నెల్లూరు జిల్లా పై నిఘా ఉంచింది. అక్కడ ఏమి జరుగుతోందో తనకు నివేదిక ఇవ్వాలని  ముఖ్యమంత్రి కార్యాలయం మౌఖికంగాఅదేశాలు జారీ చేసినట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: