చిత్తూరు జిల్లా పూర్తిగా వైసీపీ అధీనంలో ఉన్న విషయం తెలిసిందే. ఒక కుప్పం టీడీపీ చేతుల్లో ఉన్నా సరే...ఇటీవల లోకల్ ఎన్నికల్లో కుప్పంలో కూడా వైసీపీ హవా కొనసాగిన విషయం తెలిసిందే. అక్కడ చంద్రబాబుకు వైసీపీ చుక్కలు చూపించింది. ఇక మొత్తానికి చూసుకుంటే చిత్తూరులో వైసీపీ తిరుగులేని శక్తిగా ఉంది....వైసీపీకి దరిదాపుల్లో టీడీపీ కనిపించడం లేదు. ఇలాంటి పరిస్తితులు ఉన్నప్పుడు వైసీపీ ఇంకా బలం పెంచుకునేలా ఉండాలి. కానీ ఆ పార్టీ బలం తగ్గించుకునేలా ఉంది.

అలా అని టీడీపీ బలం పెరగడం వల్ల వైసీపీ బలం తగ్గడం కాదు...సొంత పార్టీ నేతల వల్లే వైసీపీ బలం తగ్గుతూ వస్తుంది. ముఖ్యంగా నగరి నియోజకవర్గంలో ఎంత రచ్చ జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ వైసీపీ వర్సెస్ టీడీపీ అనే టాపిక్ అసలు కనిపించడం లేదు. ఎంతసేపు వైసీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లే ఉంది. ఇక్కడ మొదట నుంచి ఎమ్మెల్యే రోజాకు వ్యతిరేకంగా గ్రూపు రాజకీయాలు నడుస్తున్న విషయం తెలిసిందే.

రోజాకు యాంటీగా ఉన్న గ్రూప్ తమదైన శైలిలో రాజకీయం చేస్తూ నగరిలో రోజాని సైడ్ చేయాలని చూస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య స్థానిక ఎన్నికల్లోనే రోజాకు చెక్ పెట్టాలని వ్యతిరేకవర్గం పావులు కదిపింది. కానీ రోజా...మంత్రి పెద్దిరెడ్డికి చెప్పి వ్యవహారాన్ని చక్కబెట్టారు. అయినా సరే ఈ గ్రూపు రాజకీయాలు ఆగడంలేదు. తాజాగా జగన్ పుట్టిన రోజు సందర్భంగా రోజా ప్రత్యర్ధి వర్గీయులు ఫ్లెక్షీలు కట్టించారు. అయితే రాత్రికి రాత్రే వాటిని కొందరు చింపేశారు. ఇదంతా రోజా వర్గం వారే చేశారని ఆరోపిస్తున్నారు.


ఫ్లెక్సిల చింపివేతకు నిరసనగా మాజీ ఎంపీపీ ఏలుమలై ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ధర్నా చేశారు. ఇక ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటే...ఆయనకు మద్ధతుగా చక్రపాణిరెడ్డి, కేజే కుమార్‌, మురళిరెడ్డి, రవిశేఖర్‌రాజులతో పాటు పలువురు నాయకులు నిలిచారు. వీరంతా రోజా గ్రూపుపైనే విమర్శలు చేస్తున్నారు. ఇక ఎవరెన్ని కుట్రలు చేసిన తనని ఏమి చేయలేరని రోజా అంటున్నారు. అయితే ఇంత క్లియర్‌గా నగరిలో రచ్చ జరుగుతున్నా సరే వైసీపీ పెద్దలు ఏ మాత్రం జోక్యం చేసుకోకుండా వివాదాన్ని సద్దమనిగేలా చేయడం లేదు. అసలు ఈ అంశం జగన్ దృష్టిలోకి వెళుతుందో లేదో కూడా క్లారిటీ లేదు. మరి నగరిలో ఈ రచ్చకు ఎప్పుడు బ్రేక్ పడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: