మరో నాలుగు నెలల్లో పంజాబ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది కూడా. ఇక సర్వే సంస్థలు కూడా తమ పనులు ఇప్పటి నుంచే మొదలు పెట్టేశాయి. అటు రాజకీయ పార్టీలు అయితే.. పంజాబ్‌ రాష్ట్రంలో పాగా వేసేందుకు తమ ప్రయత్నాలను ప్రారంభించాయి కూడా. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ... ఈ ఎన్నికల్లో విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇక భారతీయ జనతా పార్టీ అయితే... సిక్కులను ప్రసన్నం చేసుకునేందుకు నానా పాట్లు పడుతోంది కూడా. అందుకోసమే సిక్కుల గురువు గురు నానక్ జయంతి సందర్భంగా నవంబర్ నెల 19వ తేదీన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. అదే సమయంలో పంజాబ్‌ రాష్ట్రంంలో సత్తా చాటేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పావులు కదుపుతోంది. ఇప్పటికే పంజాబ్ రాష్ట్రంలో పలు మార్లు పర్యటించిన కేజ్రీవాల్... ఉచిత విద్యుత్ వంటి ఎన్నో హామీలు ఇచ్చేశారు.

ఇక భారతీయ జనతా పార్టీ అయితే... కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేందుకు మెగా ప్లాన్ వేసింది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో పొత్తు పెట్టుకున్న కమలం పార్టీ... తాజాగా హస్తం పార్టీకి మరో ఝలక్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రాణా గుర్మీత్ సోధీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కాంగ్రెస్ ‌పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది. తొలి నుంచి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు అత్యంత సన్నిహితునిగా గుర్మీత్ సోధీకి పేరు ఉంది. సరిగ్గా ఎన్నికలకు ముందు హస్తం పార్టీకి రాజీనామా చేసిన సోధీ... బీజేపీ పంజాబ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గజేంద్ర సింగ్ షెకావత్ సమక్షంలో బీజేపీలో చేరారు సోధీ. బీజేపీ కేంద్ర కార్యాలయంలో రాణా గుర్మీత్ సోధీకి పార్టీ కండువా కప్పి బీజేపీ సభ్యత్వం అందజేశారు గజేంద్ర సింగ్ షెకావత్. పంజాబ్ రాష్ట్రంలో మత సామరస్యం నెలకొల్పడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సోధీ విమర్శించారు. అందుకే బీజేపీ చేరినట్లు వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో పంజాబ్‌లో బీజేపీ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానన్నారు సోధీ.

మరింత సమాచారం తెలుసుకోండి: