అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మరో నాలుగు నెలల్లో పంజాబ్‌ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కూడా సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు పనిలో నిమిగ్నమై ఉంది. అటు అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటికే అన్ని పార్టీలు ప్రత్యేక ఫోకస్ పెట్టేశాయి. అటు సర్వే సంస్థలు కూడా పంజాబ్ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంచనాలు సిద్ధం చేస్తున్నాయి. ఏబీపీ సీ-ఓటర్ సర్వే సంస్థ ఇప్పటికే రెండు సార్లు తన నివేదికను విడుదల చేసింది. పంజాబ్ రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది ఏబీపీ సీ-ఓటర్ సర్వే సంస్థ. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ గట్టి పోటీ ఇస్తుందని కూడా నివేదికలో తేలింది. అయితే పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న కమలం పార్టీకి మాత్రం గట్టి ఎదురుదెబ్బ తగిలేలా నివేదికలు వచ్చాయి. కనీసం ఒక్క సీటు గెలవటం కూడా కష్టమే అని నివేదిక స్పష్టం చేసింది.

అయితే సరిగ్గా ఎన్నికల ఏడాది ప్రారంభం నుంచి అధికార కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ వ్యవహారం పార్టీకి పెద్ద ఇబ్బందిగా మారింది. ముందుగా మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో సిద్ధు వివాదం తారాస్థాయికి చేరుకుంది. చివరికి అధిష్ఠానం జోక్యం చేసుకుని రాజీ చేసింది. కానీ సిద్ధు తీరుతో విసిగిపోయిన కెప్టెన్ అమరీందర్ సింగ్... కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అటు ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీపై కూడా సిద్ధు పలు మార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాజాగా పంజాబ్ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాణా గుర్మీత్ సోధీ కూడా హస్తం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగే సోధీ... పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ తీరుపై ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. పంజాబ్ రాష్ట్రంలో హస్తం పార్టీ గెలుపు కష్టమే అని కూడా వ్యాఖ్యానించారు సోధీ.


మరింత సమాచారం తెలుసుకోండి: