టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరికే పరిమితమయిపోతున్నారా..? రాష్ట్రంలో ఎన్నో సమస్యలుండగా కేవలం మంగళగిరిపైనే ఎక్కువగా ఎందుకు ఫోకస్ పెడుతున్నారు..? అసలు నారా లోకేష్ స్ట్రాటజీ ఏమిటో అర్ధం కావడంలేదు. లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి సమస్యలు తెలుసుకోకుండా ఇలా మంగళగిరి వీధుల్లో తిరుగుతూ కాలక్షేపం చేయడం ఏమిటని పార్టీ నేతలే బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. అధికార పార్టీతో చంద్రబాబు వయసు రీత్యా కొంతవరకే పోరాడగలడని, లోకేష్ మంగళగిరిని కాస్త పక్కనపెట్టి రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా పర్యటించాలని చెబుతున్నారు. అయితే నారా లోకేష్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా మంగళగిరిలోనే పర్యటనలు చేస్తున్నారు.

నారా లోకేష్ ను భావి టీడీపీ రథసారధిగా అందరూ భావిస్తున్నారు. పార్టీలో నెంబర్ టూ పొజిషన్ కూడా లోకేష్ కు మాత్రమే సొంతం. ఈ విషయంపై గతంలో చంద్రబాబు ఎన్నోసార్లు సంకేతాలు కూడా ఇచ్చారు. పార్టీలో తన తర్వాత లోకేష్ కు మాత్రమే ఆ గౌరవం లభిస్తుంది. వేరే ఎవరినీ ఆ స్థానం వరకూ చంద్రబాబు తీసుకురారు. కనీసం ఆ ప్రయత్నం కూడా చేయరు. అయితే అలాంటి ప్రాధాన్యం కలిగిన లోకేష్, ఇప్పుడు కేవలం ఒక్క నియోజకవర్గంపైనే దృష్టి పెడుతున్నారు. 2019 ఎన్నికలలో మంగళగిరిలో ఓటమి పాలవడంతో, ఈసారి ఎలాగైనా గెలవాలని లోకేష్ ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే మంగళగిరిలో పర్యటనలు చేస్తున్నారు.  

వైరిపక్షాలాకు గట్టి సంకేతాలిచ్చేలా ఈసారి మంగళగిరిలో గెలవాలని లోకేష్ విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. కిందిస్థాయిలో ప్రజలను నేరుగా కలుసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని హామీలిస్తూ పోతున్నారు. తాజాగా మంగళగిరిలో ప్రభుత్వం కొన్ని ఇళ్లను వివిధ కారణాలతో కూల్చేసింది. దీంతో వారి వద్దకు వెళ్లిన లోకేష్, అండగా ఉంటానని భరోసా ఇస్తున్నారు. దీంతోపాటుగా వృద్ధాప్య, వితంతువుల, దివ్యాంగుల పెన్షన్లని ఇటీవల కొన్నిచోట్ల తొలగించారు. వారి తరపున కూడా న్యాయ పోరాటం చేస్తానని లోకేష్ చెబుతున్నారు. ఇలా మంగళగిరి సమస్యలపైనే లోకేష్ ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అందుకే టీడీపీ కార్యకర్తలు లోకేష్ మంగళగిరికి పరిమితమయితే ఎలాగంటూ ఆందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: