మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇందుకు ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేయడం. అలాగే రాజధాని అమరావతి ప్రాంతం కావడం. అసలు మంగళగిరి నియోజకవర్గంలో ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ గెలిచింది లేదు. అలాంటి చోట నుంచి ముఖ్యమంత్రి రేసులో ఉన్న పార్టీ అధినేత కుమారుడు పోటీ చేయడంతో అందరి దృష్టి మంగళగిరిపైనే ఉంది. ఒక దశలో గెలుపు కోసం ఇరు పార్టీలు భారీగానే ఖర్చు చేసినట్లు పుకార్లు చాలానే షికారు చేశాయి. కానీ చివరికి గెలుపు మాత్రం సిట్టింగ్ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డినే వరించింది. ఇక నారా లోకేష్ ఓడిపోవడంతో... అధికార పార్టీ నేతలు సెటైర్లు వేశారు. లోకేష్‌ను సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకున్నారు కూడా. ఒక దశలో మంగళగిరిలో గెలిచి చూపించాలంటూ లోకేష్‌కు సవాళ్లు కూడా విసిరారు. దీంతో లోకేష్ బాగా సీరియస్‌గా తీసుకున్నట్లున్నారు ఈ విషయాన్ని. అందుకే మంగళగిరి నియోజకవర్గంపైనే ప్రత్యేక ఫోకస్ పెట్టారు.

మంగళగిరిలో ఓటమితో లోకేష్‌లో పోరాట పటిమి బాగా పెరిగినట్లు కనిపిస్తోంది. అందుకే ఏ మాత్రం నిరాశ చెందకుండా సర్వశక్తులు ఒడ్డుతున్నారు లోకేష్. ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గంలో మారిన పరిస్థితులు నారా లోకేష్‌కు బాగా కలిసి వచ్చాయి. రాజధాని అమరావతి మార్పు అంశం చాలా కీలకంగా మారింది. రాజధానిని విశాఖకు మార్చడంపై మంగళగిరి ప్రాంతం వాసులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇందుకు స్థానిక ఎమ్మెల్యే కూడా మద్దతు ఇస్తుండంతో.. ఆర్కే పై కోపంతో కూడా ఉన్నారు. ఇదే విషయాన్ని లోకేష్ తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రాబోయే ఎన్నికల నాటికి పరిస్థితులు తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కూడా లోకేష్ ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నారు. దాదాపు ప్రతి రోజూ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. స్థానిక నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. చివరికి జనసేన నేతలకు కూడా దండలు వేసి దండాలు పెడుతున్నారు లోకేష్. పరిస్థితి చూస్తుంటే.. రాబోయే ఎన్నికల్లో పోటీ మరింత హోరాహోరీగా మారేలా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: