రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) కి రివర్స్ షాక్ తప్పేట్లు లేదు. పశ్చిమబెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ నేతలు పీకేకి వ్యతిరేకంగా అందులోను బాహాటంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజకీయ వ్యూహకర్త వ్యూహకర్తగానే ఉండాలి కానీ పార్టీ విషయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ ఘాటు వ్యాఖ్యలు చేయటం ఇపుడు సంచలనంగా మారింది.




పీకే సంస్ధ ఐప్యాక్ తో  తమ పార్టీ ఉన్నతికి సలహాలు ఇచ్చేందుకు మాత్రమే  ఒప్పందాలు చేసుకున్న విషయాన్ని డెరెక్ గుర్తుచేశారు. అంతకుమించి ఆ ఏజెన్సీ అభిప్రాయాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఎంపీ చెప్పిన మాటలు ఇపుడు కలకలం సృష్టిస్తున్నాయి. తాజా వ్యాఖ్యలను చూసిన తర్వాత ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అనుమతి లేకుండా డెరెక్ ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేసే అవకాశమే లేదని అర్ధమైపోతోంది. అయినా డెరెక్ హఠాత్తుగా ఎందుకిలాంటి వ్యాఖ్యలు చేశారు ?




ఎందుకంటే తృణమూల్ వ్యవహారాల్లో పీకే జోక్యం ఎక్కువైపోతోందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. మామూలుగా రాజకీయవ్యూహకర్తలంటే ఎప్పుడూ తెరవెనుక మాత్రమే ఉంటారు. కానీ దేశంలో తనకున్న పాపులారిటి కారణంగా పీకే తెరవెనుక పాత్రకు మాత్రమే పరిమితం కావటంలేదు. నరేంద్రమోడికి వ్యతిరేకంగా దేశంలోని ప్రతిపక్షాలను కలిపే ఉద్దేశ్యంతో పావులు కదుపుతున్నారు. నిజానికి ప్రతిపక్షాల కలయిక అనేది ఆయా పార్టీల అధినేతల ఆలోచనా విధానాలను బట్టుంటుంది.




అంతేకానీ రాజకీయవ్యూహకర్త చెప్పింది వినే అధినేతలు ఎవరు లేరు. నిజానికి ఏ పార్టీని కూడా పీకే అచ్చంగా తన వ్యూహాలతోనే అధికారంలోకి తేలేడన్నది వాస్తవం. అధికారంలోకి వచ్చేంత దమ్ము పార్టీల్లో ఉంటే మాత్రమే పీకీ వ్యూహాలు వర్కవుటవుతాయి. జగన్మోహన్ రెడ్డి, స్టాలిన్, మమతాబెనర్జీల విషయంలో ఇది నిరూపితమైంది. కాంగ్రెస్ తరపున పనిచేసినా ఉత్తరప్రదేశ్ లో పీకే ఫెయిలయ్యారు. సో, క్షేత్రస్ధాయి వాస్తవాలను తెలుసుకాబట్టే మమత కూడా పీకేని దూరంపెట్టేయాలని అనుకున్నారేమో. అందుకనే ఈ విషయాన్ని డెరెక్ తో చెప్పిస్తున్నట్లు అనుమానంగా ఉంది. అదే నిజమైతే మాత్రం పీకేకి రివర్సు షాక్ మొదలైనట్లే అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: