తెలుగుదేశం పార్టీ యువ నేత...ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ రాష్ట్రమంతా పర్యటించనున్నారా ?  వారంరోజులుగా జరుగుతన్న పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు  ఆయన తన పర్యటనపై క్లారిటీ  ఇచ్చినట్లు సమాచారం. తెలుగదేశం పార్టీలో ప్రస్తుతం ద్వితీయ శ్రేణి నేతలతో లోకేష్  వారం రోజులుగా ఫోన్ లో సంభాషిస్తున్నట్లు  పార్టీ వర్గాల సమాచారం.  తన పర్యటన ఎలా  చేయాలనే విషయం పై పార్టీ శ్రేణులనుంచి ఆయన అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో తన తండ్రి చేసిన విధంగా ఏదో ఒక ప్రాంతంలో మొదలు పెట్టి రాష్ట్రం అంతా పర్యటించాలా ? లేకుంటే ప్రతి నెలా ఒక్కో జిల్లా లోని నియోజక  వర్గాలలో పర్యటించాలా ? అన్న విషయమై ఆయన పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు.
ప్రస్తుతం నారా లోకేష్ తన దృష్టి అంతా మంగళగిరి పైనే ఉంచారు. 2019 ఎన్నికల్లో తనను  ఓడించిన ప్రజలకు చేరువ కావడం ద్వారా వారి మద్దతును కూడగట్టాలని ఆయన భావిస్తున్నారు. ఈ దశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి చిన్న అవకాశాన్ని వినియోగించుకుంటూ మంగళగిరి నియోజక వర్గంలో  పర్యటనలు చేస్తున్నారు. స్వంత పార్టీలో అసంతృప్తులతో నేరుగా మాట్లాడుతూ వారు పార్టీ విడిచి వెళ్లిపోకుండా తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను బేరీజు వేసుకుంటూ ముందుకు సాగాలని ఆయన సన్నిహిత మీడియా మిత్రులు చేసిన సూచనలను పాటిస్తున్నారు. ఏ ప్రాంతంలో పర్యటించినా  స్థానిక పార్టీ నేతల నుంచి ఇన్ పుట్స్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

రానున్న ఎన్నికలకు  సమాయత్తం కావడానికి ఇదే తగిన సమయం  అని నారా లోకేష్ బావిస్తున్నారు.  జనవరి పండగల తరవాత  ప్రజల్లోకి వెళ్లాలని ఆయన అనుకుంటున్నారు. అయితే మరికొందరు సన్నిహితులు రానున్న బడ్జెట్ సమావేశాల తరువాత అయితే బాగుంటుదని సలహా ఇచ్చినట్లు తెలుగుదేశం  పార్టీ శ్రేణులు పేర్కోంటున్నాయి. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అదే సరైన సమయం అని కూడా వారు స్పష్టం చేసినట్లు తెలిసింది.  ఈ లోగా  2019 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిత్వం పరాజయం పొందిన సీనియర్ ల వారసులతో లోకేష్ వరుస వెంబడి సమావేశాలు నిర్వహించనున్నట్లు  తెలుగుదేశం పార్టీ వర్గాల సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: