ఏపీలో ప్ర‌స్తుతం ప్ర‌భుత్వానికీ, సినిమా ప‌రిశ్ర‌మ ముఖ్యుల‌కూ ప‌రోక్ష యుద్ధం సాగుతోంది. ప్ర‌భుత్వం సినిమా టికెట్ ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తూ జారీ చేసిన ఆదేశాల ప్ర‌కారం థియేట‌ర్ ల‌ను న‌డిపించ‌డం సాధ్యంకాదంటూ రాష్ట్రంలో ప‌లువురు ఎగ్జిబిట‌ర్లు థియేట‌ర్ల‌ను స్వ‌చ్ఛందంగా మూసివేస్తున్నారు. దీంతో రిలీజ్‌కు సిద్ధ‌మైన సినిమాల నిర్మాత‌లు దిక్కుతోచ‌ని స్థితిని ఎదుర్కొంటున్నారు. దీనిపై సినిమా ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌నుంచి ఇప్ప‌టిదాకా ఒక‌రిద్ద‌రు హీరోలు మాత్ర‌మే నోరు విప్పి ప్ర‌భుత్వ వైఖ‌రిని విమ‌ర్శించారు. సినీపెద్ద లెవ‌రూ బ‌హిరంగంగా మాట్లాడిన దాఖ‌లాలింత‌వ‌ర‌కు లేవు. రాష్ట్ర‌ మంత్రులు మాత్రం  త‌మ ప్ర‌భుత్వ వైఖ‌రిని గ‌ట్టిగానే స‌మ‌ర్థించుకుంటున్నారు. సామాన్యులకు అందుబాటులో లేని స్థాయిలో థియేట‌ర్ల‌లో రేట్లున్నాయ‌ని అందుకే వాటిని త‌గ్గించామ‌ని చెబుతున్నారు. స్టార్ హీరోల రెమ్యూన‌రేష‌న్ విప‌రీతంగా పెరిగిపోయినందునే సినిమాల నిర్మాణ వ్య‌యం అదేస్థాయిలో పెరిగిపోతోంద‌ని, దాన్ని త‌గ్గించుకుంటే సినిమాల‌కు వ‌చ్చిన ఇబ్బందేమీ ఉండ‌ద‌ని మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్ర‌త్యేకించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ఉద్దేశించే మంత్రులు ఈ వ్యాఖ్య‌లు చేయ‌డంతో ఈ వివాదం అంత తేలిగ్గా ప‌రిష్కార‌మ‌య్యే ప‌రిస్థితి క‌నిపించ‌డంలేదు.
 

          ప్ర‌భుత్వ వైఖ‌రిపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఇప్ప‌టికే విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతోంది. జ‌న‌సేన నాయ‌కులు కూడా ఇది త‌మ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను దెబ్బ‌తీయ‌డ‌మే ల‌క్ష్యంగా జ‌రుగుతున్న ప్ర‌య‌త్న‌మ‌ని విమ‌ర్శిస్తున్నారు. ఇక‌ రాష్ట్రంలో వైసీపీకి ప్ర‌త్యామ్నాయం తామేన‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌తో క‌లిసి పోటీ చేసి అధికారంలోకి వ‌స్తామ‌ని ఢంకా బ‌జాయించి చెపుతున్న‌ బీజేపీ నాయ‌కులు దీనిపై ఇప్ప‌టికీ పెద్ద‌గా స్పందించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మేన‌ని సామాన్య ప్ర‌జ‌లు అంటున్నారు. గ‌తంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్.. వైసీపీ ప్ర‌భుత్వంపై చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలోనే వివాదం మ‌రింత ముదిరిన నేప‌థ్యంలో బీజేపీ నాయ‌కులు ఈ వివాదం ప‌రిష్కారానికి ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌ల‌కు చొర‌వచూపితే బాగుంటుంద‌ని అటు సినీ ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు కూడా అంటున్నాయి. సినిమా ప‌రిశ్ర‌మ కేవ‌లం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కో లేక మ‌రో ఇద్ద‌రు ముగ్గురు హీరోల‌కో ప‌రిమిత‌మైన‌ది కాదు.. థియేట‌ర్లు మూత‌ప‌డితే వేలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోయే అవ‌కాశ‌ముంది. ఈ ప‌రిస్థితుల్లో బీజేపీ రాష్ట్ర‌నాయ‌క‌త్వం ముందుకువ‌చ్చి అటు ప్ర‌భుత్వం ఇటు ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌తోనూ చ‌ర్చ‌లు జ‌రిపి ఉభ‌య‌తార‌కంగా వివాదాన్ని ప‌రిష్క‌రించ‌గ‌లిగితే పార్టీకి మంచిపేరు వ‌స్తుంద‌ని బీజేపీ నాయ‌క‌త్వానికి ప‌లువురు సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: