బీజేపీలోకి ఫిరాయించిన టీడీపీ ఎంపి సుజనా చౌదరి తాజాగా మాట్లాడిన మాటలు చూస్తుంటే జనాలను ఇంకా మోసం చేస్తున్నట్లే ఉంది. ప్రత్యేకహోదా, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ లాంటి అనేక అంశాల్లో జనాలను నరేంద్రమోడి సర్కార్ దిగ్విజయంగా మోసంచేసింది. ఇది సరిపోదన్నట్లుగా తాజాగా విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో కూడా సుజనా అబద్ధాలు చెబుతున్నారు.




విశాఖపట్నంలో మాట్లాడుతు విశాఖ ప్రైవేటీకరణ విషయంలో తొందరలోనే కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. తొందరలోనే విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ప్రైవేటీకరణ చేయాలని విధానపరమైన నిర్ణయం తీసుకుని చాలా కాలమే అయ్యింది. దానికి అనుగుణంగానే అడుగులు కూడా పడుతున్నాయి. ఒక్కో విభాగాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు స్టీల్ ప్లాంటు యాజమాన్యం టెండర్లు కూడా పిలుస్తొంది. ఇదే విషయాన్ని స్టీల్ ప్లాంటు ఉద్యోగులు, కార్మికులు నిరసిస్తు ఆందోళనలు కూడా చేస్తున్నారు.




ఈమధ్య పార్లమెంటులో స్టీల్ శాఖ మంత్రి మాట్లాడుతు స్టీల్ ప్లాంటును కచ్చితంగా ప్రైవేటీకరించబోతున్నట్లు చెప్పారు. ఏ కారణం వల్లనైనా అది కాకపోతే మూసేస్తామే కానీ కేంద్రం మాత్రం ప్లాంటును రన్ చేయదని స్పష్టంగా ప్రకటించారు. కేంద్రమంత్రి స్వయంగా పార్లమెంటులో ప్రకటించిన తర్వాత కూడా ఇంకా విధానపరమైన నిర్ణయం తీసుకోలేదని సుజనా చెప్పటంలో అర్ధమేంటి ? సుజనా ప్రకటనలో జనాలను మోసం చేయటమే కనబడుతోంది.




జనాల కళ్ళకు ఇంకా ఎంతకాలం గంతలు కడదామని సుజనా అనుకుంటున్నారో అర్ధం కావటంలేదు. కేంద్రం నిర్ణయాన్ని ప్రశ్నించలేనపుడు మాట్లాడకుండా కూర్చోవటమే ఉత్తమం. ఆపని చేయకుండా జనాల మనోభావాలతో ఆడుకుంటున్నారు. ఒకవైపు ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం చర్యలు కళ్ళకు కనబడుతుంటే మరోవైపు సుజనా మాత్రం నోటికొచ్చింది మాట్లాడేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కమలనాదులు ఇన్ని అబద్ధాలు చెబుతున్నారు కాబట్టే, రాష్ట్ర ప్రయోజనాలను మోడీ సర్కార్ తుంగలో తొక్కేస్తున్న గట్టిగా నిలదీయలేని స్ధితిలో ఉన్నారు కాబట్టే బీజేపీకి రాష్ట్రంలో అడ్రస్ లేకుండా ఉంది.





మరింత సమాచారం తెలుసుకోండి: