ఆంధ్రావ‌ని రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్ పొలిటీషియ‌న్ గా పేరున్న రోజా రెడ్డి (ఇంకా చెప్పాలంటే రోజా సెల్వ‌మ‌ణి..ఆమె భ‌ర్త పేరు క‌లుపుకుని చ‌దువుకోండి ఆమె పేరు ఏం కాదు)..ఈ ఏడాది ఆమె ఎలా ఉన్నారు..ఆమెను ఎవ‌రు బాధ‌పెట్టారు..ఓ విధంగా జ‌గ‌న‌న్న వీర విధేయురాలు..అని చెప్పుకునే ఆమెకు ఎందుకు ఇన్ని క‌ష్టాలు ఇవ‌న్నీ ఇవాళ మాట్లాడుతూ పోవాలి. ఏడాది చివ‌ర‌లో పొలిటిక‌ల్ రివ్యూ రాస్తూ రాస్తూ..ఆమె జీవితాన్ని సినిమా జీవితాన్నీ రాజ‌కీయా జీవితాన్నీ అవ‌లోకిద్దాం..అదేంటి సినిమా జీవితం అంటున్నారు ఆమె సినిమాల్లో లేరు క‌దా అని మాత్రం అన‌కండి. సినిమాకు రిల‌వెన్సీ ఇస్తూ ఆమె ఎప్ప‌టిక‌ప్పుడు బుల్లితెర‌పై హ‌డావుడి చేస్తూనే ఉన్నారు..జ‌బ‌ర్ద‌స్త్ తో పాటు మ‌రికొన్ని స్పెష‌ల్ షోల‌కు మ‌ల్లెమాల టీం తర‌ఫున తీర్ప‌రిగా ఉన్నారు. అదేలేండి జ‌డ్జ్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. (తీర్ప‌రి అన్న‌ది మంచి తెలుగు మాట.. మ‌న జ‌నాల‌కు ఇంగ్లీషుపై ఉన్న ప్రేమ కార‌ణంగా అది ఎక్క‌డో దాగి పోయింది)



ఇక రాజ‌కీయ జీవితం గురించి చెప్పుకుంటే ఈ ఏడాదిలో క్యాబినెట్ మార్పులు ఉంటాయ‌ని అంతా ఆశించారు. ఆ విధంగా ఉగాది త‌రువాత అని కొంద‌రు, ద‌స‌రా త‌రువాత అని కొంద‌రు లేదు లేదు 2022 సంక్రాంతి త‌రువాత అని కొంద‌రు ఇలా చాలా మాట‌లు వినిపించాయి. వినిపిస్తూ ఉన్నాయి. అయితే క్యాబినెట్ విస్త‌ర‌ణకు మాత్రం ముహూర్తం రాలేదు. రాలేదు అనే కన్నా కుద‌ర‌లేదు అని రాయ‌డం స‌బ‌బు. దాంతో పూర్తి నిరాశ‌కు లోన‌య్యారు. తీవ్ర ఆందోళ‌న‌కు గురయ్యారు. ప‌దాల‌కేం గానీ  ఆమె అనుకున్న‌వేవీ
నెర‌వేర‌లేదు. పోనీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో న‌గ‌రి కి సంబంధించి ఆమె మాట నెగ్గిందా అంటే అదీ లేదు. అక్క‌డ కూడా పెద్దిరెడ్డి మాటే నెగ్గింది. రోజా వ్య‌తిరేక వ‌ర్గాన్ని బాగా ప్రోత్స‌హించ‌డంలో మొదట్నుంచీ పెద్ది రెడ్డి ముందంజ‌లో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే
అత్యుత్సాహం కూడా చూపుతున్నారు. దీంతో రోజాకు కంట నీరు త‌ప్ప మిగిలిందేమీ లేకుండా పోయింది. పోనీ స్థానిక ఎన్నిక‌ల్లో అయినా ఆమె మాట నెగ్గించారా అంటే అదీ లేదు. ఇవ‌న్నీ ఇలా జ‌రిగిపోతుండ‌గానే రోజా మ‌ళ్లీ త‌న‌కు బాగా క‌లిసివ‌చ్చిన తిట్ల పురాణం చంద్ర‌బాబు పై అందుకుని క‌న్నీళ్లు పెట్టి సానుభూతి రాజ‌కీయం మొద‌లుపెట్టారు. రోజా అనే లేడీ లీడ‌ర్ చంద్ర‌బాబును తిట్టినంత మాత్రాన పెద్ది రెడ్డి వ‌చ్చి ఏమ‌యినా మ‌ద్ద‌తు ఇచ్చారా అంటే అదీ లేదు. నీ ఏడుపేదో నువ్వే ఏడువు..మ‌మ్మ‌ల్ని క‌ల‌ప‌మాకు అని కూడా అన్నారని స‌మాచారం.


ఆఖ‌రికి జ‌గ‌నన్న బ‌ర్త్ డే వేడుక‌లకు సంబంధించి కూడా పెను వివాద‌మే రేగింది. చిత్తూరు జిల్లా, న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో నాన్ లోక‌ల్ అయిన రోజాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిపించ‌బోమ‌ని, ఆమె అంటే త‌మ‌కు ఇష్టం లేద‌ని, పార్టీని న‌మ్ముకున్న వారిని కాద‌ని,టీడీపీ నుంచి వ‌చ్చిన వారిని ఆమె ప్రోత్స‌హిస్తున్నార‌ని పేర్కొంటూ న‌గ‌రి ప‌రిధిలో ఉన్న నాలుగు మండ‌లాల నాయ‌కులు త‌మ అసంతృప్తిని మీడియా కెమెరాల సాక్షిగా వినిపించి, రోజాకు షాక్ ఇచ్చారు. ఇదీ ఈ ఏడాది రోజా ప‌య‌నం. ఇక జ‌బ‌ర్ద‌స్త్ లాంటి షోల్లో రోజా క‌నిపించినా కూడా ముంద‌టి ఉత్సాహం కొన్ని షోల్లో లేకుండా పోయింది.  ఓ స్పెష‌ల్ షోలో త‌న జీవితం గురించి చెప్పి క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు.. ఆ మాట‌లు వైర‌ల్ అయ్యాయి కూడా! ఇవి మిన‌హా  ఆమెకు ఈ ఏడాది పెద్ద‌గా న‌వ్వులు లేవు ఏడుపే అంతిమం అయి ఉంది. వ‌చ్చే ఏడాది ఆమెకు ఆనందాలు ఇవ్వాల‌ని కోరుకోవ‌డం మిన‌హా ఇప్ప‌టికి నేను కానీ మీరు కానీ ఆఖ‌రికి మ‌న జ‌గ‌న‌న్న కానీ పెద్దాయ‌న పెద్ది రెడ్డి కానీ చేసేదేం లేదు.

 
- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

మరింత సమాచారం తెలుసుకోండి: