తెలుగు నాట రాజ‌కీయాల్లో తిరుగులేని నేతగా పేరున్న వారు చంద్ర‌బాబు. నాటి రామారావు  హ‌యాం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ త‌న‌దైన రాజ‌కీయం న‌డుపుతూనే ఎంద‌రెంద‌రినో త‌న‌వైపు మ‌ర‌ల్చి, వారికి కొత్త జీవితం ప్ర‌సాదించిన ఘ‌ట‌న‌లూ ఘ‌న‌త‌లూ ఆయ‌న‌వే! ఇప్పుడంటే ఆయ‌న లెక్క త‌ప్పినా ఒక‌ప్పుడు మాత్రం ఆయ‌న ఏం చెప్పినా వేదం అయింది. వేద వాక్కులా అమ‌లుకు నోచుకుంది. ఉమ్మ‌డి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు ప్రాభ‌వాన్ని కొట్టేయ‌లేం. అదేవిధంగా హైటెక్ సిటీ తో పాటు కొన్ని అభివృద్ధి ప‌నులపై ఆయ‌న ముద్ర‌ను చెరిపేయ‌లేం. స్వ‌ర్ణాంధ్ర సాకారానికి తాను ఎన్న‌డూ క‌ల‌లు క‌న్నానని చెప్పేవారు అప్ప‌ట్లో! మ‌రి! ముఖ్యంగా జ‌న్మ‌భూమి, ప్ర‌జల వ‌ద్ద‌కు పాల‌న లాంటి మంచి కార్య‌క్ర‌మాలు ఆయ‌న స్థాయిని పెంచాయి. 


జ‌న్మ‌భూమి పేరునే త‌రువాత ర‌చ్చ‌బండగా మార్చారు..త‌రువాత కాలంలో ఇది స్పంద‌న కార్య‌క్ర‌మంగా రూపుదిద్దుకుంది. పేర్లు ఏవ‌యినా చంద్ర‌బాబు దారిలో ఇవాళ్టికీ న‌డుస్తున్న ముఖ్య‌మంత్రులు అటు జ‌గ‌న్ కానీ ఇటు కేసీఆర్ కానీ..ఉన్నార‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ విష‌యంలో పార్టీల‌కు ఉండాల్సిన‌న్ని సైద్ధాంతిక విభేదాలు ఉన్నా కూడా కొన్ని విష‌యాలు వారు ఇప్ప‌టికే బాబునే ఫాలో అవుతారు. ముఖ్యంగా ఉద్యోగుల విష‌య‌మై అత్యంత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌డంలో జ‌గ‌న్ కానీ కేసీఆర్ కానీ ఓ విధంగా బాబును రిఫ‌రెన్స్ కోడ్ గా తీసుకుంటారు. ఇ-గ‌వ‌ర్నెన్స్ విష‌యంలో కూడా బాబు ను అనుక‌రించిన వారే ఆ ఇద్ద‌రూ..!



ఇప్పుడంటే ఆయ‌న రాజకీయంలో విఫ‌లం కావొచ్చు కానీ టీడీపీకి పూర్వ ప్ర‌గ‌తిని తీసుకురావ‌డంలో ఆయ‌న కృషి చేస్తూనే ఉన్నారు అన్న‌ది ఓ వాస్త‌వం.అయితే రాజ‌కీయంగా ఆయ‌న‌ను నిలువ‌రించేందుకు వ్య‌క్తిత్వ హ‌న‌నానికి పాల్ప‌డుతున్న ఘ‌ట‌న‌లు సొంత సామాజిక‌వ‌ర్గంకు చెందిన నేత‌లే చేస్తుండ‌డంతో చంద్ర‌బాబుకు ఏమీ పాలుపోవ‌డం లేదు అన్న‌ది కూడా నిజం. గ‌తంలో ఇలాంటి త‌ప్పిదాలే టీడీపీ చేసింది క‌నుక బుద్ధి చెప్పేందుకే తామూ ఈ త‌ర‌హా త‌ప్పుల‌ను పున‌రావృతం చేస్తున్నామ‌ని అటు వంశీ కానీ ఇటు నానీ కానీ చెప్పుకుని త‌మ‌ని తాము స‌మ‌ర్థించుకుంటున్నారు. అవును! ఆ రోజు జ‌గ‌న్ ను అవ‌మానించారు క‌నుక ప్ర‌జ‌లు ఆయ‌న‌కు బుద్ధి చెప్పారు.. ఇప్పుడు మీరు ఆయ‌న‌ను అవ‌మానిస్తున్నారు క‌నుక రేపు మీక్కూడా అదే గ‌తి, అధోగ‌తి ఖాయం అన్న‌ది రాజ‌కీయ ప‌రిశీల‌కుల ఉవాచ.


రాజ‌కీయంగా లోకేశ్ ను ఢీ కొనడం అన్నది చాలా సులువు. ఆయ‌ను వాక్ చాతుర్యం లేదు అన్న‌ది వాస్త‌వం.ఈ సంద‌ర్భంలో తార‌క్ ను సీన్ లోకి తీసుకుని రావాల‌ని ఎప్ప‌టి నుంచో టీడీపీలో కొంద‌రు ప్ర‌య‌త్నిస్తున్నా బాబుకు న‌చ్చ‌డం లేదు. త‌ప్ప‌క తీసుకు వ‌చ్చినా ఆయ‌న‌కు ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వ‌కుండా ఉంటే కొత్త త‌గువులు, త‌ల‌నొప్పులు పుట్టుకువ‌స్తాయి క‌నుక తార‌క్ ఇటుగా రారు. భువ‌నేశ్వ‌రిపై వైసీపీ చేసిన వ్యాఖ్య‌ల విష‌య‌మై కూడా తార‌క్ ఆచితూచి స్పందించారు. దీంతో టీడీపీ అభిమానుల కోపానికి గుర‌య్యారు. పార్టీని లోకేశ్ కు అప్ప‌గించ‌డం స‌సేమీరా ఇష్టంలేని నాయ‌కుల్లో గోరంట్ల,అచ్చెన్న లాంటి సీనియర్లు ఉన్నార‌న్న‌ది వాస్త‌వం. క‌నుక తారక్ టీడీపీ కో వ‌రం కావొచ్చు.. ఆయ‌న‌ను ఉప‌యోగించుకుంటే రేప‌టి వేళ అద్భుతం కూడా! ఆ విధంగా కాకుండా బుడ్డోడు..బుడ్డోడు అని వ‌దిలేసి,లోకేశ్ ను న‌మ్ముకుని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల ముందుకు వెళ్తే ప‌రాభ‌వం ఖాయం అన్న‌ది ఇంకొంద‌రి చంద్ర‌బాబు శ్రేయోభిలాషుల మాట.







మరింత సమాచారం తెలుసుకోండి: