ఇండ‌స్ట్రీలో సీనియ‌ర్ న‌టుడు బాల‌య్య .. త‌రాల చరిత్ర‌కు ప్ర‌తినిధి కూడా ఆయ‌నే! ఇవాళ నంద‌మూరి కుటుంబం ఇండ‌స్ట్రీని శాసించే స్థాయిలో ఉన్నా ప్ర‌భుత్వ పెద్ద‌తో మాట్లాడే చొర‌వ మాత్రం తీసుకోలేకపోతోంది. దీంతో బాల‌య్య వ్యూహాత్మ‌క మౌనం కార‌ణంగా ఇండ‌స్ట్రీ ఎంతో న‌ష్ట‌పోతోంది. రానున్న పెద్ద సినిమాల భ‌విష్య‌త్ అంతా డోల‌యామానంలోనే ఉంది. బాల‌య్య వ‌ర‌కూ అఖండ సినిమాతో హిట్ కొట్టినా ఓవ‌ర్ సీస్ కలెక్ష‌న్ల కార‌ణంగా ఆయ‌న సినిమా ఒడ్డెక్కేసింది. కానీ తెలుగు రాష్ట్రాల‌లో ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో బాల‌య్య సినిమాకు రావాల్సినంత డ‌బ్బులు రాలేదు. ఆ విధంగా చూస్తే ఈ సినిమా ఫ్లాప్.. జ‌గ‌న్ అన్న విధించిన నియ‌మ నిబంధ‌న‌ల అనుసారం అయితే మాత్రం అఖండ కు పెద్ద దెబ్బే త‌గిలినా నిర్మాత ఎందుక‌నో పెద్ద‌గా మాట్లాడ‌లేదు. ఆఖ‌రికి  స‌ర్దుకుపోయే నైజంలోనే అటు బాల‌య్య ఇటు బోయ‌పాటి వీరితో పాటు నిర్మాత మిరియాల ర‌వింద‌ర్ రెడ్డి కూడా ఉండ‌డ‌మే అత్యంత ఆశ్చ‌ర్య‌క‌రం.


తెలుగువాడి ఆత్మ‌గౌర‌వ ప్ర‌తీక రామారావు (ఎన్టీఆర్)..ఆయ‌న వార‌సుడిగా బాలయ్య అటు రాజ‌కీయాల్లో ఇటు సినిమాల్లో రాణిస్తున్న వైనం తెలిసిందే. కానీ నాన్నంత‌టి స్థాయిలో ప్ర‌భుత్వ విధానాల‌ను నిర‌సించ‌డంలో వెనుకంజ‌లోనే ఉన్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఢీకొన్న ఎన్టీఆర్ తెలుగు జాతిలో చైత‌న్యం నింపారు. త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక పంథానే అల‌వ‌ర్చుకుని, తెలుగు జాతి రోషం, పౌరుషం ద‌శ‌దిశ‌లా చాటారు. కానీ బాల‌య్య నాన్న‌లో ఒక్క వంతు కూడా రోషం కానీ పౌరుషం కానీ చూపించ‌లేక‌పోతున్నారు. ఇండ‌స్ట్రీకి అన్యాయం జ‌రుగుతున్నా, ఒక్కొక్క‌టిగా థియేట‌ర్లు మూత‌ప‌డుతున్నా బాల‌య్య స్పందించ‌డం లేదు.


జ‌గ‌న్ ను ఎదిరించే సాహ‌సం బాల‌య్యకు లేదా అన్న‌ది ఓ వాద‌న. ఎందుకంటే బాల‌య్య ముక్కోపి..ఆవేశ ప‌రుడు.. అయినా కూడా జ‌గ‌న్ ను ఎదుర్కోలేక‌పోతున్నారు. కనీసం ఒక్క మాట కూడా అనడం లేదు ఆయ‌న‌ను ఉద్దేశించి..బ‌హుశా! జ‌గ‌న్ త‌న అభిమాని అని ప్రేమ ఏమో! ఏదేమ‌యిన‌ప్ప‌టికీ టికెట్ రేటు త‌గ్గించే విష‌య‌మై బాల‌య్య స్పందించ‌క పోవ‌డం తో ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ముక్కున వేలేసుకుంటున్నాయి. అంతా ఆ భ‌గ‌వంతుడే చూస్తాడ‌ని మొన్న‌టి వేళ విజ‌య‌వాడ‌లో వేదాంత ధోర‌ణిలో బాల‌య్య మాట్లాడ‌డం కూడా ఆయ‌న స్థాయికి త‌గ‌దు. వాస్త‌వానికి బాల‌య్య హిందూపురం ఎమ్మెల్యే.. ఆ ప్రాంత అభివృద్ధి ఏమీ లేద‌ని అప్పుడెప్పుడో ఫైర్ అయ్యారు కూడా! హిందూపురం ఆస్పత్రుల్లో వైద్యులు బాగా ప‌నిచేస్తున్నా సంబంధిత ప‌రిక‌రాల కొర‌త ఉంద‌ని,దీనిని వెంట‌నే నివారించాల‌ని కూడా అన్నారు. హిందూపురం ఆస్ప‌త్రి పై చూపించిన శ్ర‌ద్ధ సినిమా ఇండ‌స్ట్రీపై ఎందుక‌నో చూపించ‌డం లేదు ఆయ‌న.




మరింత సమాచారం తెలుసుకోండి: