ఈ ఏడాది,జూన్ 26న రేవంత్ రెడ్డి కి పీసీసీ పీఠం వ‌రించింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ కు మంచి రోజులు వ‌చ్చాయ‌ని అంతా భావించారు. కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం కూడా రేవంత్ పై బోలెడు ఆశ‌లు పెట్టుకుంది. చచ్చి బ‌తుకుతున్న కాంగ్రెస్ కు జ‌వం,జీవం నింపేది రేవంత్ రెడ్డేన‌ని అంతా భావించారు కూడా! రాహుల్ - రేవంత్ అన్న‌ది హిట్ కాంబినేష‌న్ అవుతుంద‌ని తెగ న‌మ్మ‌కంతో సోనియాతో స‌హా కీల‌క అగ్ర నాయ‌క‌త్వం నిర్ణ‌యానికి వ‌చ్చింది కూడా! క‌డు స‌మ‌ర్థుడు అయిన రేవంత్ రెడ్డి  మాత్రం ఆ న‌మ్మ‌కాలు ఎందుక‌నో అందుకోలేక‌పోతున్నారు. ముఖ్యంగా ఇప్ప‌టికీ ఆయ‌నది కాంగ్రెస్ డీఎన్ఏ కాద‌ని ఆయ‌నది టీడీపీ డీఎన్ఏ అని చాలా మంది విమ‌ర్శ‌లు చేస్తుంటారు. పార్టీలో రాజ‌శేఖ‌ర్ రెడ్డి వ‌ర్గం అంతా రేవంత్ ను ఎప్ప‌టి నుంచో వ్య‌తిరేకిస్తూనే ఉంది. అంతేకాదు ప‌ద‌వి అందుకుని ఆరు నెలలు అయినా ముఖ్యంగా ద‌ళిత దండోరాల పేరిట కాస్త హడావుడి చేసినా, ఆరంభంలో కొన్ని చోట్ల బ‌హిరంగ స‌భ‌లు అంటూ దుమ్ము రేగొట్టినా త‌రువాత ఆ ఉత్సాహం ఆయ‌న‌లో లేక‌పోయింది.




ఇక పార్టీలో ఎప్ప‌టి నుంచో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వ‌ర్గం ఆయ‌నను వ్య‌తిరేకిస్తూనే ఉంది. హుజురాబాద్ ఎన్నిక‌ల్లో అస‌లు పోరాట ప‌టిమే చూప‌లేక‌పోయారు రేవంత్..ఇందుకు కార‌ణం కూడా పార్టీలో ఉన్న విభిన్న వ‌ర్గాలే. అంత పెద్ద స‌ముద్రం నుంచి ఒడ్డున పడ్డ చేప కౌశిక్ రెడ్డి మాత్రం న‌దిలాంటి టీఆర్ఎస్ లో చేరిపోయి హాయిగా అనుకున్న రోజులు క‌న్నా కాస్త ఆల‌స్యంగా ఎమ్మెల్సీ అయిపోయారు.  ఎమ్మెల్యేల కోటా నుంచి పాడి కౌశిక్ రెడ్డి ఎంఎల్సీ అయ్యారు అనుకున్న‌ది చివ‌ర‌కు సాధించారు. ఆ పాటి కూడా విజ‌యాలు కూడా రేవంత్ సాధించిన దాఖ‌లాలేవీ లేవు. పార్టీలో రెడ్డి సామాజిక‌వ‌ర్గ నేత‌ల్లో చాలా మంది ఇప్ప‌టికీ రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌ర‌ఫు గ్రూపుగానే ఉంటూ త‌మ‌దైన రాజ‌కీయం న‌డుపుతున్నారే కానీ రేవంత్ మాట అయితే అస్స‌లు విన‌డం లేదు. విహెచ్ లాంటి నేత‌లు  అస్స‌లు గాంధీభ‌వ‌న్ రాజ‌కీయ‌మే త‌ప్ప పార్టీ రాజ‌కీయం,పార్టీ ప్రాభ‌వం పెంచ‌డం వంటివి అస్స‌లు ప‌ట్ట‌ని విధంగానే ఉన్నారు. దీంతో గాంధీ భ‌వ‌న్ వాస్తు అయితే మార్చగ‌లిగారేమో కానీ మ‌నుషుల మైండ్సెట్ ను మాత్రం రేవంత్ మార్చ‌లేక‌పోయారు. రేవంత్ - సీత‌క్క కాంబినేష‌న్ లో కొన్ని ఆదివాసీ ప‌ల్లెలు చుట్టి వ‌చ్చినా ఇంద్ర‌వెల్లి స‌భ‌తో హంగామా చేసినా త‌రువాత త‌రువాత ఆ వేడి కూడా చ‌ల్లారిపోయింది. డ్ర‌గ్స్ కేసులో కేటీఆర్ కు  వైట్ ఛాలెంజ్ విసిరి రేవంత్ సంచ‌ల‌నం అయ్యారు.




ఆ రోజు కూడా గ‌న్ పార్క్ వ‌ద్ద కాస్త హ‌డావుడి చేసి త‌రువాత త‌గ్గిపోయారు.ఇదే రీతిలో మ‌రికొన్ని స‌మ‌స్య‌ల‌పై గ‌ళ‌మెత్తి ఆ త‌రువాత త‌గ్గిపోవ‌డం,నిశ్శ‌బ్దం అయిపోవ‌డం అన్న‌వి రేవంత్ కు ష‌రామామూలుగానే త‌యార‌యిన ప‌రిణామాలు. ఈ త‌రుణంలో పార్టీ ఒడ్డెక్క‌డం క‌ష్టం అన్న‌ది తేలిపోయిన విష‌యం. కోమ‌టి రెడ్డి వెంక‌ట‌రెడ్డి లాంటి నేత‌లు, జీవ‌న్ రెడ్డి లాంటి నేత‌లు ఇప్ప‌టికీ అస‌మ్మ‌తి స్వ‌రం వినిపిస్తున్న వేళ వచ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ బ‌లం పుంజుకోవ‌డం అన్న‌ది జ‌ర‌గ‌ని ప‌ని అని తేలిపోయింది. మ‌రో ఆరోప‌ణ ఏంటంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ కు అనుబంధంగా ఉన్నార‌ని కూడా వినిపిస్తున్న వాద‌న‌. దీనిపై కూడా స్ప‌ష్ట‌త ఇవ్వాల్సింది పీసీసీ చీఫే! కానీ ఆయ‌న వీటిపై మాట్లాడ‌రు. కానీ సంద‌ర్భం ఉన్నా,లేక‌పోయినా కేసీఆర్ ను బూతులు తిట్ట‌డంలో మాత్రం తెగ ఉత్సాహం చూపిస్తూ మీడియాలో హైలెట్ అయ్యేందుకే త‌న కాలాన్ని వినియోగిస్తున్నార‌ని, ప‌ద‌వినీ అందుకే వాడుకుంటున్నార‌నీ ఓ ఆరోప‌ణ. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఓ చంద్ర‌బాబు బంటు అని, గులాబీ దండుకు చెందిన కోవ‌ర్టు అని ఇప్ప‌టికే వినిపిస్తున్న అభియోగాల కార‌ణంగా కాంగ్రెస్ కు ఆయ‌న పూర్వ వైభ‌వం తేవ‌డం అన్న‌ది ఇప్ప‌ట్లో జ‌రిగే ప‌ని కాదు...అన్న‌ది క‌రడు గ‌ట్టిన కాంగ్రెస్ వాదుల మాట.
 









మరింత సమాచారం తెలుసుకోండి: