పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు కేంద్రంగా నిన్నటి వేళ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఓ గొప్ప సమావేశం జరిగింది. దీనికి ఉభయ గోదావరి జిల్లాల తరుణ్ సాంఘిక్ గోదావరి సంగమం అని పేరు పెట్టారు. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ విచ్చేసి మాట్లాడారు. కరసేవకులు అంతా అల్లూరి స్ఫూర్తితో పనిచేయాలని పిలుపునిచ్చారు. కులాలకు అతీతంగా హైందవ ధర్మాన్ని కాపాడాలని చెప్పారు. అంతా బాగుంది కానీ మన్యం వీరుడి సాయం బీజేపీ వాళ్లకెందుకు అవసరం వచ్చిందని ఓ చర్చ.


ఇంతవరకూ అల్లూరిని సొంతం చేసుకుని కాస్తో కూస్తో ఆయన ఉద్యమ స్ఫూర్తిని ప్రచారం చేసే పనిలో బీజేపీ ఎప్పుడో ఉంది. భగత్ సింగ్ తో పాటు అల్లూరిని కూడా బీజేపీ కీర్తించిన దాఖలాలు ఉన్నాయి కానీ పెద్దగా అల్లూరిని ఫోకస్ లోకి తెచ్చిన దాఖలాలు లేవు. గోదావరి జిల్లాలలో క్షత్రియ సామాజికవర్గ ఆరాధకుడిగానే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల వీరుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. మరి! అల్లూరిని ఒకే ప్రాంతానికి, ఒకే కులానికి, ఒకే పార్టీకి పరిమితం చేయడంలో అర్థం లేదు. ఆయన అందరివాడు. అయినా కూడా ఎందుకనో బీజేపీకి మరియు దానిని నడిపించే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కు అల్లూరి ని స్మరించడం ఓ బాధ్యతగా మారిపోయింది. మంచిదే అల్లూరి స్ఫూర్తితో గిరిజ‌న తండాల అభివృద్ధికి కేంద్రంపై ఒత్తిడి తెస్తే ఇంకా బాగుంటుంది అని నా లాంటి వారి అభిప్రాయం. కేవ‌లం స్ఫూర్తి వ‌ర‌కే ప‌రిమితం కాకుండా ఆచ‌ర‌ణ‌కు కూడా ప్రాధాన్యం ఇస్తే రాష్ట్రీయ సేవ‌క్ సంఘ‌కు మ‌రింత నిబ‌ద్ధ‌త చేకూరుతుంది.


అయితే కాంగ్రెస్ అల్లూరిని పెద్ద‌గా పట్టించుకోదు కనుక వీళ్లు పట్టించుకుంటున్నారా లేదా ఇందులో ఏమయినా ప్రాంతీయ వాదం ఒకటి  నిగూఢంగా ఉందా? రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా అల్లూరి స్ఫూర్తితో పనిచేస్తాం అని చెప్పిన ఆంధ్రులే కాదు తెలంగాణ వాదులు ఇప్పటికీ ఉన్నారు. కనుక అల్లూరిని బీజేపీ సొంతం చేసుకుంటే చేసుకోవచ్చు కానీ ఓ పార్టీకి ఐకన్ గా అల్లూరిని చూ పించడం అన్నది సబబు కాదు. ఆ మాటకు వస్తే మా శ్రీకాకుళంలోనూ ఆ విప్లవ యోధుడంటే ప్రాణం పెట్టే వారు ఉన్నారు. క‌మ్యూనిస్టులు కూడా సొంతం చేసుకునే అల్లూరికి బీజేపీకి మరియు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా నిన్న‌టి వేళ మ‌రింత ప్రాధాన్యం ఇవ్వ‌డం ఒకింత ఆశ్చ‌ర్య‌క‌రం. యోధుడెవ్వ‌ర‌యినా అత‌డు పార్టీల‌కు అతీతం..ప్రాంతాల‌కు అతీతం..కులాల‌కూ సంబంధిత వ‌ర్గ స‌మీక‌ర‌ణాల‌కూ అతీతం అన్న‌ది ఈ క‌థ‌నం ప్రాథ‌మిక ఉద్దేశం. అల్లూరిని అంతా స్మ‌రించాలి.. అంద‌రిలోనూ ఆ స్ఫూర్తి కాంక్ష ర‌గ‌లాలి..ర‌గిలించాలి..అదేవిధంగా నిబ‌ద్ధ‌త‌తో కూడిన ఆచ‌ర‌ణ‌కు అటు బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ప్రాధాన్యం ఇవ్వాలి.. అంతేకానీ ఒక పార్టీకో ఓ ప్రాంతానికో ఓ స‌మూహానికో ఆయ‌న చెందిన వ్య‌క్తి అయితే కాదు.. రేప‌టి వేళ కాకూడ‌దు కూడా!


మరింత సమాచారం తెలుసుకోండి:

rss