ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటీషన్‌ పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి.  అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే అది రద్దు చేయాలంటూ నరసాపురం పార్లమెంట్ సభ్యులు, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ముందుగా సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ ఎదురు దెబ్బ తగలడంతో... తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ వేశారు ఆర్ఆర్ఆర్. రఘురామ తరఫున ప్రముఖ న్యాయవాది వెంకటేష్ హైకోర్టులో తన వాదనలు వినిపించారు. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని... అక్రమాస్తుల కేసులో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని న్యాయవాది వెంకటేష్ హైకోర్టు ముందు వాదించారు. బెయిల్ రద్దు పిటిషన్‌పై వైఎస్ జగన్‌కు నోటీసులు ఇవ్వాలని కూడా హైకోర్టును అభ్యర్థించారు. దీనిపై సీబీఐ తరఫు న్యాయవాదిని కూడా హైకోర్టు ప్రశ్నించింది. తన వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని హైకోర్టు ఆదేశించింది.

దీనిపై హైకోర్టుకు సీబీఐ తరఫు న్యాయవాది వివరణ ఇచ్చారు. ఇప్పటికే వైఎస్ జగన్‌కు బెయిల్ మంజూరు చేసే విషయంలో... సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తన తీర్పును ఇది వరకే వనిపించినట్లు తెలిపారు. తీర్పు వచ్చిన తర్వాత పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని కూడా న్యాయవాది స్పష్టం చేశారు. జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై ఇరు వైపుల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు... తన తీర్పును రిజర్వ్ చేసింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు ఎంపీ విజయ సాయి రెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు రఘురామ కృష్ణంరాజు. ముందు సీబీఐ కోర్టును ఆశ్రయించారు రఘురామ. సాక్షులను ప్రభావితం చేస్తున్నారంటూ తన పిటీషన్‌లో ఫిర్యాదు చేశారు రఘురామ. అలాగే కేసు విచారణను కావాలనే అడ్డుకుంటున్నారని కూడా ఆరోపించారు. ఇక కేసుకు సంబంధించి కౌంటర్లు దాఖలు చేయడంలో కూడా తీవ్ర జాప్యం చేస్తున్నారని సీబీఐ న్యాయస్థానంలో వాదించారు రఘురామ కృష్ణంరాజు.


మరింత సమాచారం తెలుసుకోండి: