ఒకరు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...మరొకరు టి‌పి‌సి‌సి వర్కింగ్ ప్రెసిడెంట్...రాజకీయంగా ఇద్దరు నేతలు శత్రువులు. ఒక పార్టీపై ఒకరు ఎప్పుడు విమర్శలు చేసుకుంటారు. అలాంటిది తాజాగా ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఒకే వేదికపైకి రావడం...ముచ్చట్లు పెట్టుకోవడంతో అటు టీఆర్ఎస్ వర్గాలు, ఇటు కాంగ్రెస్ వర్గాలు ఆశ్చర్యంవ్యక్తం చేస్తున్నాయి. అసలు రాజకీయపరంగా విరుద్ధమైన దారుల్లో వెళుతున్న నేతలు కలవడంపై రకరకాలుగా ప్రచారం జరుగుతుంది.

అసలు ఏ ఇద్దరి వర్కింగ్ ప్రెసిడెంట్ల గురించి చర్చ జరుగుతుందో ఈ పాటికే అందరికీ అర్ధమైందని చెప్పొచ్చు. ఒకరు టీఆర్ఎస్‌కు భవిష్యత్ నాయకుడైన వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మరొకరు టి‌పి‌సి‌సి పదవి ఆశించి భంగపడి టి‌పి‌సి‌సి వర్కింగ్ ప్రెసిడెంట్‌తో సరిపెట్టుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.  ఈ ఇద్దరు నేతలు తాజాగా ఒక వేదికపై సందడి చేసిన విషయం తెలిసిందే. ఇటీవల సంగారెడ్డిలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు కేటీఆర్ హాజరయ్యారు.

అలాగే ప్రోటోకాల్ ప్రకారం సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా హాజరయ్యారు. ఇక ఇద్దరు నేతలు స్టేజ్ మీద మంచిగా ముచ్చటలు పెట్టుకున్నారు. సెటైర్లు వేసుకున్నారు...నవ్వుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జగ్గారెడ్డి ఇంకా కారు ఎక్కేస్తారని ప్రచారం మొదలైంది. కానీ జగ్గారెడ్డి మాత్రం పార్టీ మారేది లేదని అంటున్నారు. అదే సమయంలో టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఎప్పుడు ఏదొకవిధంగా విమర్శలు చేస్తుంటారు. తాజాగా ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అయితే మెదక్ జిల్లా ఎమ్మెల్యే అయిన తనకు తెలియకుండా రేవంత్ రెడ్డి ఎలా కార్యక్రమం చేస్తారని జగ్గారెడ్డి ప్రశ్నిస్తున్నారు.

దీంతో కేటీఆర్‌కు జగ్గారెడ్డి మధ్య ఉన్న బంధం ఎలా ఉంది..రేవంత్ రెడ్డితో ఎలా ఉందో అర్ధమవుతుంది. టీఆర్ఎస్ ఏమో జగ్గారెడ్డిని ఆహ్వానిస్తుంది గానీ, రేవంత్ రెడ్డి మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో జగ్గారెడ్డి జంపింగ్ ఖాయమని ప్రచారం మొదలైంది. ఇదే క్రమంలో సంగారెడ్డి టీఆర్ఎస్ ఇంచార్జ్ చింతా ప్రభాకర్, జగ్గారెడ్డి విషయంలో కాస్త భయపడుతున్నారు. జగ్గారెడ్డి పార్టీలోకి వస్తే తన భవిష్యత్ ఏంటని కంగారు పడుతున్నారు. అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా జగ్గారెడ్డి పార్టీ మారిపోతారేమో అని టెన్షన్ పడుతున్నారు. మొత్తానికి అటు కాంగ్రెస్, ఇటు కారు పార్టీ నేతలని జగ్గారెడ్డి టెన్షన్ పెడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: