ఔటర్ రింగ్ రోడ్.. ఇటీవల అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ వద్దని జగన్ సర్కారు కేంద్రానికి చెప్పిందని కొన్ని మీడియాల్లో వచ్చిన వార్తలు కలకలం రేపాయి.. కావాలని ఎల్లో మీడియా జగన్ సర్కారుపై బురద జల్లిందని వైసీపీ మంత్రులు ఆ కథనాలపై విరుచుకుపడ్డారు. అసలు లేని ఔటర్ రింగ్‌ రోడ్డును జగన్ వద్దంటున్నారని ప్రచారం చేస్తున్నారని వైసీపీ మంత్రులు ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ కు డీపీఆర్ పంపలేదని.. ఈ విషయం దాచి పెట్టి జగన్ సర్కారుపై బురద జల్లుతున్నారని వైసీపీ మంత్రులు చెప్పుకొచ్చారు.


ఆ విషయం ఎలా ఉన్నా.. ఇప్పుడు ఏపీలోని మరో నగరానికి ఔటర్ రింగ్‌ రోడ్డు మంజూరైంది. ఇంతకీ ఆ సిటీ ఏమిటనుకుంటున్నారా..అదే రాజమండ్రి.. అవును.. రాజమండ్రికి ఔటర్  రింగ్ రోడ్ ను కేంద్రం మంజూరు చేసిందట. ఈ విషయాన్ని ఎంపీ భరత్ మీడియాకు తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ నుంచి తనకు ఉత్తర్వులు అందాయని ఎంపీ  భరత్ చెబుతున్నారు. రాజమండ్రి చుట్టూ 25 నుంచి  30 కిలోమీటర్ల రింగ్ రోడ్ నిర్మాణం జరుగుతుందని ఎంపీ భరత్ చెబుతున్నారు.

 
రాజమండ్రి చరిత్రలోనే ఇది మరిచిపోలేని రోజని ఎంపీ భరత్‌ ఆనందం వ్యక్తం చేశారు. రాజమండ్రికి  రింగ్ రోడ్  సాధించడం తనకు గర్వకారణంగా ఉందని ఎంపీ భరత్ అంటున్నారు. దాదాపు వెయ్యి  కోట్ల రూపాయల వ్యయంతో ఈ రాజమండ్రి రింగ్  రోడ్  నిర్మాణం అవుతుందని ఎంపీ మార్గాని భరత్ అంచనా వేస్తున్నారు. అయితే ఇది ఎంపీ భరత్ చెబుతున్న విషయమే.. దీనిపై కేంద్రం అసలు ఏం చెప్పింది.. ఆ లేఖలో ఏముందనే విషయాలు వెల్లడి కావాల్సి ఉంది.


ఏదేమైనా ఏపీలో ఓ నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు రావడం ఆహ్వానించదగ్గ పరిణామమే. ఓ నగరం విస్తరణలో మౌలిక సదుపాయాల కల్పనలో ఔటర్ రింగ్‌ రోడ్డు చాలా కీలకపాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

orr