తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ఏడు నీటి ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదు చేసింది. కృష్ణా, గోదావరి బోర్డులపై కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో అనేక అంశాలను ఏపీ ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. గోదావరిపై తెలంగాణ రాష్ట్రం అక్రమంగా 7 ప్రాజెక్టులు నిర్మిస్తోందని కేంద్ర జల శక్తి శాఖకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ నోటిఫికేషన్ తక్షణమే అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్ర జల శక్తి శాఖకు స్పష్టం చేసింది.


బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాలను పక్కన పెట్టి తెలంగాణ  ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని.. ఇది చట్ట వ్యతిరేకమైన చర్య అంటూ ఆంధ్రప్రదేశ్‌ గుర్తు చేసింది. విభజన చట్టంలోని 11 షెడ్యూల్ ప్రకారం వివిధ ప్రాజక్టు లకు కేంద్రం అనుమతి మంజూరు చేసిందని.. అందువల్ల కొత్తగా డీపీఆర్లు అవసరం లేదని ఏపీ ప్రభుత్వం ఈ సమావేశంలో అభిప్రాయపడింది. అయితే.. ఇదే సమావేశంలో పాల్గొన్న తెలంగాణ అధికారులు సైతం ఇదే తరహాలో వాదనలు వినిపించారు. గెజిట్‌లో అనుమతులు లేని ప్రాజెక్టులుగా పేర్కొన్న ఐదింటిని జాబితా నుంచి తొలగించాలని వాదించారు.


వివిధ అంశాలపై రెండు  రాష్ట్రాల మధ్య అభ్యంతరాలు ఉన్నందున ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాల్సి ఉందని కేంద్ర జలశక్తి శాఖ అభిప్రాయపడింది. రెండు తెలుగు రాష్ట్రాలు అజెండా అంశాలు సిద్ధం చేసి ఇస్తే.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిపి అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తామని కేంద్ర జలశక్తి శాఖ చెబుతోంది. ఇక రెండు బోర్డుల నిర్వహణ కోసం ఏపీ, తెలంగాణ చెల్లించాల్సిన నిర్వహణ వ్యయం గురించి కూడా కేంద్రం చర్చించింది. అయితే.. సీడ్ మనీ 200 కోట్ల రూపాయలను విడతల వారీగా ఇస్తామని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలిపింది. తాము మూడు నెలలకు ఓ మారు చెల్లింపులు చేస్తామని ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపాదించింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: