దేశంలోని రైతులకు ప్రధాని మోదీ నూతన సంవత్సర కానుక అందించబోతున్నారు. అవును.. అయితే ఈ కానుక అందరికీ కాదండోయ్.. తమ స్వేదంతో నేలను సాగు చేసి దేశానికి అన్నం పెడుతున్న రైతన్నలకు మాత్రమే మోడీ కొత్త సంవత్సర కానుక అందించబోతున్నారు. అవును.. ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం పదో విడత నిధులను మోదీ ప్రభుత్వం జనవరి ఒకటిని రైతుల ఖాతాల్లో వేయాలని నిర్ణయించింది.


జనవరి ఒకటిన 20వేల కోట్లపైగా నిధులను రైతుల ఖాతాలకు విడుదల చేయనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పథకం పదో విడత చెల్లింపుల కింద ఈ సొమ్మును రైతుల ఖాతాల్లో వేయనున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ప్రధాని మోదీ వర్చువల్‌ విధానంలో ఈ పీఎం కిసాన్‌ నిధులను విడుదల చేయనున్నట్లు పీఎంఓ వివరించింది. నూతన సంవత్సర కానుకగా రానున్న ఈ నిధులతో 10 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు.


మరో విశేషం ఏంటంటే.. జనవరి ఒకటినే 351  రైతు ఉత్పత్తి సంస్థలకు 14 కోట్ల రూపాయలను ఇక్విటీ గ్రాంట్‌ కింద ప్రధాని విడుదల చేయబోతున్నారు.. ఈ విషయాన్ని కూడా ప్రధాని  కార్యాలయం వెల్లడించింది. ఈ పీఎం కిసాన్‌ పథకం కింద ఇప్పటివరకూ 1.6 లక్షల కోట్లను రైతుల ఖాతాలకు కేంద్రం బదిలీ చేసిందట. ఈ వార్త తెలంగాణ రైతులకైతే డబుల్ బోనాంజాలాంటిదని చెప్పవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం కూడా రైతు బంధు నిధులను ఇప్పుడే విడుదల చేస్తోంది.


అంటే తెలంగాణ రైతులకు అటు మోడీ డబ్బులు.. ఇటు కేసీఆర్ డబ్బు రెండు కూడా కేవలం వారం రోజుల వ్యవధిలో అందుతాయన్నమాట. తెలుగు రైతులకు ఇది పండుగ సీజన్.. కొత్త సంవత్సరంతో పాటు.. సంక్రాంతి కూడా రాబోతోంది. ఈ సమయంలో ఈ డబ్బు విడుదల కావడం రైతులకు సంతోషకరమైన విషయమే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: