ఏపీలో దేవాలయాల సందర్శన మరింత కష్టతరం కానుందా..? పరిస్థితులు చూస్తుంటే అలాగే కనిపిస్తున్నాయి. ఇప్పటికే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఆంక్షలు విధించడం తప్పనిసరిగా మారింది. ఇప్పటికే ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో నిబంధనలు అమలవుతుండగా.. తాజాగా శ్రీశైలంలోనూ కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని అధికారులు మార్గదర్శకాలు విడుదల చేశారు. తాజాగా ఆలయ ఉన్నతాధికారులందరూ సమావేశమై.. దర్శనానికి వచ్చేవారి కోసం కొన్ని రూల్స్ పెట్టేశారు. ఆ రూల్స్ ప్రకారమే ఇకపై శ్రీశైల మల్లన్నను దర్శించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

ఇకపై శ్రీశైల మల్లన్నను దర్శించుకునేందుకు వచ్చే భక్తులందరూ కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. భక్తులందరూ సామాజిక దూరం పాటించాల్సిందేనని.. కచ్చితంగా మాస్కులు ధరించాలని అధికారులు ఆదేశాలిచ్చారు. అదే విధంగా ఇకపై శ్రీశైల క్షేత్రంలోని బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు లేకుండా తిరిగితే వంద రూపాయలు జరిమానా కూడా విధిస్తామని చెబుతున్నారు. వ్యాపార సంస్థలు నిబంధనలు అతిక్రమిస్తే భారీగా జరిమానాలు విధించాలని కూడా నిర్ణయించారు. ఏకంగా పది నుంచి పాతిక వేల వరకూ ఈ జరిమానాలు ఉండబోతున్నాయని సమాచారం. ఈ నిబంధనలన్నిటినీ ఇప్పటికే ప్రచారం కూడా చేస్తున్నారు.

మరోవైపు ఆలయానికి వచ్చే ప్రతీఒక్కరికీ ఫీవర్ సర్వే కూడా నిర్వహించాలని నిర్ణయించారు. ఒకవేళ కరోనా లక్షణాలతో ఎవరైనా కనిపిస్తే తీసుకోవాల్సిన చర్యలపైనా నిర్ణయం తీసుకున్నారు. ఏది ఏమైనా ఇకపై ఏపీ దేవాలయాల్లో కరోనా నిబంధనలు కచ్చితంగా అమలు కానున్నట్టు తెలుస్తోంది. గతంలో కరోనా పేరుతో తిరుమల దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యను గణనీయంగా తగ్గించేశారు. భక్తులకు జారీ చేసే టికెట్లను కూడా పరిమితం చేశారు. ఇంకా వాటిని పూర్తి స్థాయిలో పెంచలేదు. ఇప్పుడల్లా పెంచే అవకాశం కూడా లేదు. ఇప్పుడు శ్రీశైల మల్లన్న దర్శనంపై కూడా ఆంక్షలు విధించారు. మరికొన్ని ఆలయాల్లో కూడా ఇదే విధానాన్ని అమలు చేసే ఆలోచనలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: