వైసీపీ కంచుకోట అయిన మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ దూకుడుగా రాజకీయం మొదలుపెట్టింది. ఇప్పటివరకు అనేక మంది నేతలు మారిన సరే మాచర్లలో టీడీపీ తలరాత మారలేదు. కానీ ఈ సారి టీడీపీ తలరాత మార్చి మాచర్లలో సైకిల్ సవారీ చేయిస్తానని కొత్త ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి బాగా కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఇంతవరకు నేతలు మారుతూ వస్తున్నారు గానీ, మాచర్లలో మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాత్రం చెక్ పెట్టలేకపోతున్నారు.

ఎప్పుడో 1999 ఎన్నికల్లో మాచర్లలో టీడీపీ గెలిచింది. మళ్ళీ అక్కడ పార్టీ గెలవలేదు. అప్పుడు టీడీపీ తరుపున జూలకంటి దుర్గాంబ విజయం సాధించారు. ఇక 2004, 2009 ఎన్నికల్లో దుర్గాంబ తనయుడు బ్రహ్మానందరెడ్డి టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. వరుసగా ఓడిపోవడంతో చంద్రబాబు, కొత్త నేతని తెరపైకి తీసుకొచ్చారు. 2014లో మాచర్ల బరిలో కొమ్మారెడ్డి చలమారెడ్డిని పోటీకి దించారు. అయినా గానీ పిన్నెల్లికి చెక్ పెట్టలేకపోయారు. ఇక 2019 ఎన్నికల్లో మరో కొత్త నాయకుడుని తీసుకొచ్చారు. అంజిరెడ్డిని పోటీకి దించారు. అయినా ఉపయోగం లేదు.

దీంతో అంజిరెడ్డిని మార్చి మళ్ళీ చలమారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అయినా సరే మాచర్లలో టీడీపీ పుంజుకోలేదు. పిన్నెల్లి హవా కంటిన్యూ అవుతూనే వస్తుంది. ఇదే క్రమంలో చలమారెడ్డిని పక్కనబెట్టి మళ్ళీ బ్రహ్మానందరెడ్డికి ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. అయితే బాధ్యతలు తీసుకున్న వెంటనే బ్రహ్మానందరెడ్డి దూకుడుగా రాజకీయంగా చేయడం మొదలుపెట్టారు. పదవి వచ్చిన వెంటనే కార్యకర్తలతో మాచర్లలో భారీ ర్యాలీ పెట్టారు. ఊహించని విధంగా టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు.

ఇదే సమయంలో టీడీపీ కార్యకర్తలు కట్టిన బ్యానర్లని గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు. దీంతో మాచర్లలో రాజకీయ యుద్ధం మరింత ముదిరింది. ఈ సారి ఎన్ని ఇబ్బందులు వచ్చిన టీడీపీ కార్యకర్తలు తగ్గేలా లేరు. ఇంకా దూకుడుగా పనిచేసేలా ఉన్నారు. అలాగే బ్రహ్మానందరెడ్డి కూడా దూకుడుగా ఉన్నారు. మరి ఈ దూకుడుతో మాచర్లలో సైకిల్‌ని సెట్ చేస్తారేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: