తెలంగాణ లో వచ్చే ఎన్నికల కోసం పార్టీలన్నీ ఇప్పటి నుండే సమాయత్తమవుతున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకోవడానికి బిజెపి, అలాగే కాంగ్రెస్ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. రెండు పార్టీలు కూడా బలం పుంజుకొని టిఆర్ఎస్ ఢీ కొట్టేందుకు సమాయత్తమవుతున్నాయి. అయితే ఈ రేసులో కాంగ్రెస్ కంటే బిజెపి కాస్త ముందున్నట్లు కనిపిస్తోంది. కానీ టిఆర్ఎస్ ను పూర్తిగా ఢీకొట్టే విపక్షం ఎవరన్నది ఇంకా పూర్తిగా తేలలేదు. అయితే ఈ రెండు పార్టీలకు చెందిన నేతలతో సక్యత కొనసాగిస్తున్న టిఆర్ఎస్ మాజీ నేత తీరు రాజకీయ వర్గాల్లో  చర్చనీయాంశంగా మారింది. గతంలో టిఆర్ఎస్ తరఫున చేవెళ్ల ఎంపీ గా వ్యవహరించిన విశ్వేశ్వర్ రెడ్డి ఆ తర్వాత ఆ పార్టీతో విభేదించారు. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరి చేవెళ్ల ఎంపీ గా పోటీ చేసి  టిఆర్ఎస్ అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే విశ్వేశ్వర్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.

కొన్నిసార్లు కాంగ్రెస్ కు మద్దతుగా, మరికొన్నిసార్లు బీజేపీకి సన్నిహితంగా ఉంటున్నట్లు కనిపిస్తున్నారు. హుజరాబాద్ లో బిజెపి ఎమ్మెల్యే గా పోటీ చేసిన ఈటెల రాజేందర్ ను గెలిపించాలని బహిరంగంగానే ప్రజలకు పిలుపు నిచ్చారు.అయితే ఇటీవల రేవంత్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. అయితే విశ్వేశ్వర్ రెడ్డి తీరు చూస్తున్న వాళ్లు మాత్రం రాజకీయంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని చర్చించుకుంటున్నారు.

 ఎన్నికల నాటికి కాంగ్రెస్, బిజెపిల్లో ఏ పార్టీ టీఆర్ఎస్ తో గట్టిగా పోరాటం చేస్తుందో నమ్మి, ఆ పార్టీలోనే ఆయన ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే తనకు రాజకీయంగా టిఆర్ఎస్ ప్రధాన శత్రువు అని, ఆ పార్టీని దెబ్బకొట్టే ఏ పార్టీకైనా మద్దతు ఇచ్చేందుకు ఆయన సిద్ధపడచ్చు అనే చర్చ సాగుతోంది. అయితే ఆర్థికంగాను బలంగా ఉన్న నాయకుడు కావడంతో విశ్వేశ్వర్ రెడ్డి ఈ రకంగా వేచిచూసే ధోరణిని అవలంబిస్తున్నారని ఇంకొందరు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో చాలామంది నాయకులు ఇదే ధోరణి లో ఉన్నారని, అయితే విశ్వేశ్వర్ రెడ్డి బహిరంగంగా రెండు పార్టీల నేతలతో సన్నిహితంగా ఉండటం వల్లే ఈ చర్చ జరుగుతుంది అనే వాదన కూడా ఉంది. అయితే కొండా కోసం పట్టుదలగా ఉన్న రేవంత్ రెడ్డి అతని తో మంతనాలు జరిపి కాంగ్రెస్ గూటికి చేరేలా ఒప్పించారని తాజాగా వినిపిస్తున్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: