తెలంగాణ‌లో ఎంఐఎంను బూచిగా చూపించి ప్ర‌యోజ‌నం పొందాల‌నుకుంటున్న బీజేపీకి హిందూ ముస్లింలు భాయ్ భాయ్ అనుకుంటూ క‌లిసి జీవించే ఏపీలో అలాంటి అంశం దొర‌క‌కనే కులాలను విభ‌జించే వ్యూహంతో బ‌ల‌ప‌డాల‌ని చూస్తోంది. అయితే తాజాగా గుంటూరులోని జిన్నా ట‌వ‌ర్ అంశాన్ని ఎంచుకోవ‌డం ద్వారా ఇప్పుడు మ‌త విద్వేషాల‌ను కూడా రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నంలో ప‌డిన‌ట్టు క‌నిపిస్తోంది. జిన్నా దేశ విభ‌జ‌న‌ను కోరుకుని ఉండొచ్చు. విభ‌జ‌న‌కు ప్ర‌ధాన కార‌ణం కూడా అయి ఉండొచ్చు. కానీ అప్ప‌టి సామాజిక‌, రాజ‌కీయ ప‌రిస్థితులు, అనివార్యంగా జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌పై ఇప్పుడు విశ్లేష‌ణ చేయ‌లేం. కానీ జిన్నా కూడా మ‌హాత్ముడితో క‌లిసి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న నాయ‌కుడన్న‌ది నిజం. ఆ కార‌ణంగానే దేశ విభ‌జ‌న నాటి ప‌రిణామాల‌కు ప్ర‌త్య‌క్ష సాక్షి ఐన బీజేపీ కురువృద్ధుడు లాల్‌కృష్ణ అద్వానీ ఒక సంద‌ర్భంలో జిన్నాను దేశ‌భ‌క్తుడుగా కొనియాడింది మ‌ర‌చిపోలేం. ఏపీకి సంబంధించినంత‌వ‌ర‌కు ముస్లింల జ‌నాభా చెప్పుకోద‌గిన సంఖ్య‌లో ఉండే ప్రాంతాలు గుంటూరు, క‌డ‌ప‌, క‌ర్నూలు, నెల్లూరు. ఇక్క‌డెప్పుడూ మ‌తప‌ర‌మైన గొడ‌వ‌లు లేవు.
 

     తెలంగాణ‌లో నిజాం పాల‌న నాటి దుష్కృత్యాల కార‌ణంగా ఎంతో కొంత హిందూ ఓటు బ్యాంకును సంఘ‌టితం చేయ‌గ‌ల నేప‌థ్యం బీజేపీకి ఉంది. నిజానికి తెలంగాణ‌లో సైతం పాత బ‌స్తీని మిన‌హాయిస్తే ఇత‌ర ప్రాంతాలకు చెందిన‌ ప్ర‌జల్లో ఈర‌క‌మైన విభ‌జ‌న ఇప్ప‌టిదాకా లేదు. ఎందుకంటే నిజాం నిరంకుశ పాల‌న‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేసిన‌వారిలో అన్నివ‌ర్గాల‌వారితోపాటు పేద ముస్లింలు కూడా ఉన్నారు. అందుకే మ‌త ప్రాతిప‌దిక‌న ఆవిర్భ‌వించిన ఎంఐఎం పార్టీ పాత బ‌స్తీకి మాత్రమే ప‌రిమిత‌మైంది. బీజేపీ రాజ‌కీయ వెలుగులు కూడా నిన్న‌మొన్న‌టిదాకా హైద‌రాబాద్ న‌గ‌రానికి వెలుప‌ల అంతంతమాత్ర‌మేన‌ని చెప్పాలి. అయితే దేశవ్యాప్తంగా బీజేపీ ఎంచుకున్న కుల‌మ‌తాల విభ‌జ‌న‌పై ప్ర‌ధానంగా ఆధార‌ప‌డే సోష‌ల్ ఇంజ‌నీరింగ్ వ్యూహాన్ని తెలంగాణ‌లోనూ అమ‌లు చేయ‌డం ద్వారా అక్క‌డ బ‌ల‌ప‌డేందుకు ప్ర‌య‌త్నాలు సాగిస్తోంది. ఇప్పుడు ఏపీ పైనా ఇదే వ్యూహాన్ని అమ‌లు చేసేందుకు జ‌రుగుతున్న‌ ప్ర‌య‌త్నాల్లో భాగ‌మే తెలంగాణ‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గుంటూరులోని జిన్నా ట‌వ‌ర్ పై చేస్తున్న వ్యాఖ్య‌ల‌ని భావించాల్సి వ‌స్తోంది. నిజానికి జిన్నా దేశ‌ద్రోహి అయితే ఏపీ ప్ర‌జ‌ల ఆమోదం లేకుండా జ‌రిగిన రాష్ట్ర‌విభ‌జ‌న‌కు స‌హ‌క‌రించ‌డ‌మే కాకుండా, విభ‌జ‌న హామీల‌ను తుంగ‌లో తొక్కి ఏపీ ప్ర‌జ‌ల క‌ష్టాలకు కార‌ణ‌మైన ఢిల్లీ నాయ‌కుల‌ను ఏమ‌నాలో మ‌రి..!


మరింత సమాచారం తెలుసుకోండి: