ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య పీఆర్‌సీ గొడవ ఇప్పట్లో తెగేలా లేదు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు తీరుస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇక ప్రజా సంకల్ప యాత్ర పేరుతో నిర్వహించిన పాదయాత్రలో ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ విధానం రద్దు చేస్తామన్నారు. అలాగే పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తామని కూడా జగన్ హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్లు దాటింది. కానీ ఇచ్చిన హామీలు అలాగే ఉన్నాయి. దీంతో ఉద్యోగులంతా ప్రస్తుతం ఉద్యమ బాట పట్టారు. చివరికి నవంబర్ నెలలో ప్రభుత్వానికి సమ్మె నోటీసు కూడా ఇచ్చారు. ఆందోళనలు చేశారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరికి సమావేశాల్లో వార్నింగ్ కూడా ఇచ్చారు. చివరికి తిరుపతి పర్యటనలో జగన్ మరోసారి హామీ ఇవ్వడంతో ఆందోళనలు విరమించారు.

అయితే వారం రోజుల్లో పీఆర్‌సీ ఇస్తామన్న జగన్ మాట ఇప్పుడు అమలు కాలేదు. ఉద్యోగుల పీఆర్‌సీ ప్రకటన మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. పీఆర్‌సీకి సంబంధించిన వివిధ డిమాండ్లను ఇప్పటికే ప్రభుత్వం ముందు ఉంచారు ఉద్యోగ సంఘాల నేతలు. అలాగే ఫిట్ మెంట్ విషయంలో గట్టి పట్టుదలతో ఉన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించేందుకు ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది. దీంతో పీఆర్సీ ప్రకటన మరింత ఆలస్యం అయ్యేలా పరిస్థితి కనిపిస్తోంది. ఇదే విషయాన్ని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా స్పష్టం చేశారు. దీంతో పీఆర్‌సీ ప్రకటన కొత్త ఏడాదిలోనే ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్ మెంట్‌తో పీఆర్‌సీ ఇవ్వాలని ఇప్పటికే అధికారుల కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయితే దీనిపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇది తాము కోరుతున్న దానిలో సగం కూడా లేదంటున్నారు. దీంతో పీఆర్‌సీ ప్రకటన విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నట్లుగా 30 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని జగన్ సర్కార్ భావిస్తోంది. దీనిపై కసరత్తు చేయాలని... ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: