కరోనా వైరస్ మహారాష్ట్రపై పగబట్టినట్లుగా కనిపిస్తోంది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్..... వేవ్ ఏదైనా సరే.. కేసుల పెరుగుదలలో మాత్రం మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంటుంది. ఇప్పుడు తాజాగా కరోనా వైరస్‌తో పాటు.... ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా భారీగా నమోదు అవుతున్నాయి. అదే సమయంలో మరణాలు మరింత కలవరపెడుతున్నాయి. దీంతో మహా అఘాడీ సర్కార్ అప్రమత్తమైంది. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా... ఆంక్షలను కఠినంగా అమలు చేసేందుకు రెడీ అయ్యింది. బృహన్ ముంబై కార్పోరేషన్ పరిధిలోని అన్ని పార్కులు, పబ్లిక్ ప్లేసులు, మైదానాలు, బీచ్‌లు కూడా సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే తెరుచుకుని ఉంటాయి. ఆ తర్వాత నుంచి వాటిల్లోకి ఎలాంటి ప్రవేశాలు ఉండవని బీఎంసీ అధికారులు వెల్లడించారు. ఇవి జనవరి 15వ తేదీ వరకు అమలులో ఉంటాయని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరికలు జారీ చేసింది.

ఇక వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కూడా ముంబై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది మరాఠా సర్కార్. జనవరి నెల 7వ తేదీ వరకు మహారాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని కూడా ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ ప్రకటించింది. ప్రజల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకుని ఆంక్షలు విధించినట్లు ముంబై నగర పోలీసు కమిషనర్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. ఈ సమయంలో బీచ్‌లు, వాకింగ్ ఏరియాలు, మైదానాల్లోకి ఎవరికీ అనుమతి లేదన్నారు. ఇక ముంబై నగరంలోని పబ్బులు, హోటల్స్, బహిరంగ ప్రదేశాల్లో పార్టీలపై నిషేధం విధించారు పోలీసులు. మహారాష్ట్రలో ఒక్కరోజే ఏకంగా 5 వేల 368 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిల్లో ముంబై నగరంలో మాత్రమే ఏకంగా 3 వేల 671 మంది వైరస్ బారిన పడ్డారు. ఇక ఒమిక్రాన్ కేసుల నమోదులో కూడా ముంబై టాప్ ప్లేసులో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 198 కేసులు వస్తే... ముంబైలో మాత్రమే 190 మంది ఒమిక్రాన్ బాధితులు ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: