తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు అంశం మరోసారి  చర్చకొచ్చింది.ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కార్పొరేషన్ల ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును ప్రభుత్వం 61 ఏళ్లు పెంచిన విషయం తెలిసిందే. అప్పట్లోనే ఆర్టీసీ కూడా తమ ఉద్యోగులకు కూడా దాన్ని వర్తింపచేయాలంటూ ప్రభుత్వం ప్రతిపాదించింది.కానీ 2019 సమ్మె సమయంలోనే ఆర్టీసీ  ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 ఏళ్లకు పెంచింది. మళ్లీ 61 ఏళ్ల పెంపు ప్రతిపాదన రావడంతో ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేశారు.కానీ వయసు పైబడే కొద్దీ బస్సులు నడపడం కష్టంగా ఉంటుందని, తమకు వయసు పెంపు  అవసరం లేదని డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్ లలో సింహభాగం మంది మొరపెట్టుకున్నారు.

వీలైతే వీఆర్ఎస్ ప్రకటిస్తే వెళ్ళిపోతామని కూడా పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వం 61 ఏళ్ల వయసు అంశాన్ని వర్తింప చేయకుండా పెండింగ్ లో ఉంచింది.డిసెంబర్ 31 నుంచి 60 ఏళ్ల ప్రతిపాదికన రిటైర్మెంట్లు మొదలు కానున్నాయి. అయితే పెంపునకు సానుకూలంగా ఉన్నతస్థాయి అధికారులు మరోసారి రిటైర్మెంట్ వయసు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తేవాలని నిర్ణయించారు. విషయాన్ని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి పువ్వాడ తో గురువారం చర్చించి,ప్రభుత్వ పరిశీలనలో ఉన్న ప్రాతిపదనకు పచ్చ జెండా ఊపేలా చూడాలని యత్నిస్తున్నారు. ఉన్నతాధికారులు దాన్ని స్వాగతిస్తుండటం, శారీరక శ్రమ ఎక్కువగా చేసే కార్మికులు వ్యతిరేకిస్తుండడంతో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై ఆర్టీసీలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసలే అప్పట్లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కష్టం గా ఉన్న ఆర్టీసీకి 60 ఏళ్ల పెంపు పెద్ద సమస్యగా మారింది. వెయ్యికి పైగా బస్సులు తగ్గించడం,కొత్త బస్సులు కొనకపోవడంతో  నాలుగు వేల మందికి పనులే లేకుండా పోయాయి. వయసు పెంపు ప్రతిపాదన పెండింగ్ లో ఉండటం వల్ల మరో రెండేళ్లు రిటైర్మెంట్ లు లేకపోవడం ఆర్టీసీకి మరింత భారమయ్యింది.అయినా అధికారులు వ్యవస్థను పట్టించుకోకుండా, కేవలం తమ పదవీ విరమణ పెంపు పై ఆసక్తి చూపుతుండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: