భారత్ లో నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్న సమయం. ప్రధాన మంత్రి దామోదర్ దాస్ నరేంద్ర మోడీ  కార్యాలయం వద్ద డాలర్ కోసం వెతుకులాట జరిగింది.  పి.ఎం.ఓ కార్యాలయ సిబ్బంది తో పాటు ఆయన రక్షణ సిబ్బ్ంది కూడా డాలర్ కోసం వెతికారు.  ఇది అందరినీ ఆశ్చర్య చకితులను చేసింది. ఇంతకీ అక్కడ ఏం జరిగింది?
ప్రధాన మంత్రి  ఈ ఏడాది కూడా ప్రతి ఏడాది లాగానే నిరాడంబరంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ అధికారం లోకి వచ్చిన నాటి నుంచి కూడా ఢిల్లీ లోని అధికార పీఠాల వద్ద నూతన సంవత్సర వేడుకలు భారీ స్థాయిలో జరగడం లేదు. కారణాలు ప్రస్తుతం అనవసరం కూడా. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పండితులు ఆయనను కలిశారు. వేద ఆశీర్వచనం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు తిరుమల, శ్రీశైలానికి చెందిన పలువురు వేద పండితులు, అర్చకులు ప్రధాన మంత్రి దామోదర్ దాస్ నరేంద్ర మోడీని కలిసి ఆశీర్వచనం చేశారు.  స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించారు. అంత వరకూ బాగానే ఉంది ప్రధాన మంత్రి కార్యాలయం అధికారులు,  ఆయనకు రక్షణగా ఉండే సిబ్బంది వేద పండితులు ఆశీర్వచనం అందిస్తున్న సమయంలో డాలర్ కోసం వెతికారు. ఆశ్చర్యంగా ఉందా ?  అవును ఇది నిజం. వారు వెతికింది ఆభరణాల్లో  వేసుకునే డాలర్ కోసం కాదు.  తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన డాలర్ శేషాద్రి కోసం.  గత కొన్ని సంవత్సరాలుగా ఎవరు ప్రధాన మంత్రీగా ఉన్నా కూడా టిటిడికి చెందిన వేద పండితులు ఆశీర్వచనం చేయడం రివాజు. ప్రధాన మంత్రికి ఆశీర్వచనం చేసే పండితుల బృందంలో ఓఎస్ డి హోదాలో డాలర్ శేషాద్రి క్రమం తప్పకుండా ఉండేవారు. దీంతో ప్రధాని కార్యాలయ సిబ్బందికి ఆయన చిరపరిచితుడు. ఈ ఏడాది వేద పండితుల బృందంలో ఆయన లేరు. కారణం.. ఇటీవలే ఆయన కాలం చేశారు. ఈ విషయం ప్రధాన మంత్రి కార్యాలయ  సిబ్బందికి తెలియదు.  దీంతో వారు డాలర్ శేషాద్రి కోసం వెతికారు. తరువాత అసలు విషయం తెలుకుని బాధపడ్డారు. అలా డాలర్ శేషాద్రి నూతన సంవత్సరం రోజు ప్రధాన మంత్రి కార్యాలయ సిబ్బందికి గుర్తుకు వచ్చారు.ప్రధాన మంత్రిని వేదపండితులు ఆశీర్వదించిన అంశాన్ని భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురు అరవింద్ సామాజిక మాధ్యమాలలో  పంచుకున్నారు కూడా. అయితే ఆయన డాలర్ శేషాద్రి ప్రస్తావన చేయలేదు.  



మరింత సమాచారం తెలుసుకోండి:

pmo