జగన్ ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా వృద్దాప్య ఫించన్ ను మరో 250 పెంచింది. ప్రస్తుతం 2250గా ఇస్తున్న ఫించన్ ను ఈనెల నుంచి రూ. 2500 ఇస్తామని ప్రకటించారు. నిన్న జనవరి ఫస్ట్‌ను దాన్ని ప్రారంభించారు.  అయితే.. దీనిపై టీడీపీ విమర్శలు ప్రారంభించింది. అసలు జగన్ తాను అధికారంలోకి వస్తే పింఛన్ రూ. 3000 చేస్తానని హామీ ఇచ్చారని.. కానీ ఇప్పటికి కేవలం రూ. 500 మాత్రమే పెంచారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శిస్తున్నారు.


ఆయన ఏమంటున్నారంటే.. “ పెన్షన్ పై జగన్ రెడ్డి మడమ తిప్పాడు. వృద్ధుల పెన్షన్ రూ.2000 నుండి రూ.3000లకు పెంచుతా తిరుపతి సభలో చెప్పారు. అధికారం చేపట్టి ఇప్పటికీ మూడేళ్లు ముగియవస్తున్నా పెంచి ఇచ్చింది కేవలం రూ. 250 మాత్రమే. జగన్ రెడ్డి మోసకారి మాటలతో ఒకొక్క పెన్షన్ దారునికి రూ.23,250 నష్టం వాటిల్లింది. జగన్ రెడ్డి, వైఎస్ కలిపి పెంచింది కేవలం రూ.375 మాత్రమే.. 2014లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే నాటికి రూ.200గా ఉన్న పింఛన్‌ను ఐదు సంవత్సరాలలో రూ.1,800 పెంచి 54.25 లక్షల మందికి అందించారని అచ్చెన్న అంటున్నారు.


చంద్రబాబు అలా చేస్తే.. జగన్ రెడ్డి రెండున్నర సంవత్సరాలలో కేవలం రూ. 250 పెంచి ఒకొక్కరికీ రూ. 23,250  ఎగనామం పెట్టి 54.25 లక్షల పెన్షన్ దారులకు రూ. 12,613 కోట్లు మోసం చేశాడని అచ్చెన్న అంటున్నారు. చంద్రబాబు  రూ.1800 పెంచినా ప్రచారం చేసుకోలేదని.. కానీ.. జగన్ రెడ్డి రూ.250 పెంచి.. రూ.20 కోట్లు ఖర్చు పెట్టి పత్రికల్లో ప్రచారం చేసుకుంటున్నారని అచ్చెన్న మండిపడుతున్నారు. ఇప్పటికి మూడుసార్ల ప్రచారంతో రూ. 60 కోట్లు ప్రజాధనం వృధా చేశాడని.. వయోపరిమితి తగ్గించడంతో లక్షలాది మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చానని ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి.. కొత్తగా ఎంత మందికి పెన్షన్లు మంజూరు చేశారో సమాధానం చెప్పాలని అచ్చెన్న ప్రశ్నించారు.


అధికారిక లెక్కల ప్రకారమే ప్రస్తుతం మొత్తం పెన్షన్ దారులు 60 లక్షలు కూడా లేరని... ఇది మాట తప్పుడు మడమ తిప్పుడు కాదా? అని అచ్చెన్నమండిపడ్డారు. జగన్ ఇచ్చిన హామీ ఏమిటి.? అమలు చేస్తున్నదేమిటి.? అనే విషయంపై ముఖ్యమంత్రి ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: