టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్య‌వ‌హార‌శైలి ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు జ‌గ్గారెడ్డి అధిష్టానికి రాసిన లేఖ విష‌యంలో తీవ్ర దుమారమే చెల‌రేగిన విష‌యం తెలిసిందే. దీనిపై నేత‌లు రెండు వ‌ర్గాలుగా విడిపోయి ఎవ‌రి వాద‌న వాళ్లు వినిపిస్తున్నారు. ఈ వ్య‌వ‌హారంపై స్పందించిన పీసీసీ క్ర‌మ‌శిక్ష‌ణ‌ క‌మిటీ చైర్మ‌న్ చిన్నారెడ్డి.. జ‌గ్గారెడ్డి పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ‌ను ఉల్లంఘించిన‌ట్టు పేర్కొన్నారు. జ‌గ్గారెడ్డి లేఖ అంశంపై చ‌ర్చించేందుకు క‌మిటీ స‌భ్యులు గంగారామ్, గ‌డ్డం వినోద్‌, క‌మ‌లాక‌ర్ రావు త‌దిత‌రులతో చిన్నారెడ్డి భేటీ అయ్యారు. అనంత‌రం మీడియాతో మాట్లాడిన ఆయ‌న.. జ‌గ్గారెడ్డిని రెండు, మూడు రోజుల్లో పిలిచి మాట్లాడుతామ‌ని తెలిపారు.


 పార్టీ శిక్ష‌ణా త‌రగ‌తుల సంద‌ర్భంగా ఘ‌ర్ష‌ణ‌కు దిగిన జంగా రాఘ‌వ‌రెడ్డి ఇదివ‌ర‌కే వివ‌ర‌ణ ఇచ్చార‌ని ఆయ‌న్ను మ‌రోసారి పిలిచి వివ‌ర‌ణ కోరుతున్నామ‌న్నారు. మ‌రోవైపు చిన్నారెడ్డి వ్యాఖ్య‌ల‌పై జ‌గ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ ఎదుట హాజ‌రుకావ‌డానికి త‌న‌కేం అభ్యంత‌రం లేద‌ని, అయితే ముందుగా రేవంత్‌తో మాట్లాడానికే త‌న‌ను పిల‌వాల‌ని సూచించారు. తాను సోనియాగాంధీకి రాసిన లేఖ ఎలా బ‌హిర్గ‌త‌మైందో తెలియ‌డం లేద‌న్నారు. పార్టీ నిర్ణ‌యం లేకుండా అభ్య‌ర్థిని ఎంపిక చేస్తే క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌ల్లోకి రాదా అని ప్ర‌శ్నించారు. త‌న సొంత జిల్లాలోనే నిర‌స‌న కార్యక్రం ఏర్పాటు చేసి త‌న‌కు ఎందుకు చెప్పాలేద‌న్నారు.


   అయితే, జ‌గ్గారెడ్డి వేరే దారి చూసుకుంటున్నాడ‌ని దానికి అనుకూల‌మైన వాతావర‌ణాన్ని సృష్టించుకోవ‌డం కోసం ఇలాంటి వ్వ‌వ‌హారాలకు పాల్ప‌డుతున్నార‌నే చ‌ర్చ న‌డుస్తోంది. రేవంత్ రెడ్డితో జ‌గ్గారెడ్డి ఇంత పెద్ద‌గా గొడ‌వ పెట్టుకోవ‌డానికి కార‌ణం ఏంట‌న్న‌ది అస్ప‌ష్టంగా ఉంది. ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం మొద‌ల‌వుతున్న నేప‌థ్యంలో జ‌గ్గారెడ్డి త‌న వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నార‌ని.. అందులో భాగంగానే ఆయ‌న కేసీఆర్‌ను, కేటీఆర్‌ను పొగుడుతున్నారు. అలాగే, జ‌గ్గారెడ్డి టీఆర్ఎస్ వైపు చూస్తున్నార‌నే వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. కేసీఆర్ అండ చూసుకునే ఆయ‌న ఇదంతా చేస్తున్నార‌ని, జ‌గ్గారెడ్డి, రేవంత్ రెడ్డి  మ‌ధ్య కేసీఆర్ ఏమైన పొగ‌బెట్టారా అనే ఊహాగానాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: