ఏపీలో గత నాలుగైదు నెలలుగా రాజకీయ పరిణామాలు ఎంత వేడివిడిగా సాగుతున్నాయో గమనిస్తూనే ఉన్నాము. అసెంబ్లీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు తాను తిరిగి ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీలో అడుగు పెట్టను అని శప‌థం చేశారు. ఆ తర్వాత ఆయన ప్రెస్‌మీట్లో ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిణామాలు అన్ని వంగవీటి రాధా చుట్టూ తిరుగుతున్నాయి. శనివారం మాజీ ముఖ్యమంత్రి... టిడిపి అధినేత చంద్రబాబు సైతం ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశం అయ్యారు.

ఈ సమావేశంలో రాధా తో పాటు ఆయన తల్లి ర‌త్న‌కుమారి కూడా ఉన్నారు. అయితే ఇక్కడే ఓ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. 33 సంవత్సరాల క్రితం విజయవాడ నడిబొడ్డున అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వంగవీటి మోహన రంగా దారుణ హత్యకు గురయ్యారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. నాడు రంగా ప్రజా ఉద్యమాల ద్వారా ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేవారు. ఈ క్రమంలోనే విజయవాడ రాజకీయాల్లో వంగవీటి రంగా ప్రత్యర్థిగా దేవినేని నెహ్రూ ఉండేవారు. నిరాహార దీక్షలో ఉన్న రంగా దారుణంగా హ‌త్య‌కు గురి కావ‌డం అప్పట్లో రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసింది.

రంగా హత్య తర్వాత రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేసేందుకు చివరకు సైన్యాన్ని దించాల్సిన పరిస్థితి వచ్చింది. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి ఆయన భార్య ర‌త్న‌ కుమారిని పరామర్శించాల‌ని అనుకున్నారు. రంగా ఇంటికి వెళ్లిన ఎన్టీఆర్ కారు దిగి పై అంతస్తులోకి వెళ్లేందుకు ప్రయత్నించినా.. రంగా అభిమానులు అడ్డుకోవడంతో వెనక్కి వెళ్లిపోయారు.

ఐదు నిమిషాల పాటు వేచి చూసిన ఎన్టీఆర్ చివ‌ర‌కు వెనక్కు వెళ్లారు. అయితే ఇప్పుడు రంగా తనయుడు రాధా ను పరామర్శించేందుకు చంద్రబాబు ఆయన ఇంటికి వెళితే రెడ్ కార్పెట్ వేసి మరీ స్వాగతం పలికారు. నాడు రంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉండి తెలుగుదేశం పార్టీ పై పోరాటం చేస్తే.... ఇప్పుడు ఆయన తనయుడు రాధా అదే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: