తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అనే చర్చ లేదనే సంగతి తెలిసిందే. ఎందుకంటే అక్కడ టీడీపీ ఉనికి లేదు. కాకపోతే పేరుకు మాత్రం టీడీపీ ఉంది. దానికి ఒక అధ్యక్షుడు ఉన్నారు. బక్కని నరసింహులు అధ్యక్షుడుగా ఉన్నారు. ఇక ఏదో వేళ్ళ మీద లెక్కబెట్టేలా ఆ పార్టీలో నాయకులు ఉన్నారు. ఏదో అక్కడక్కడ మాత్రమే ఆ నాయకులు కనిపిస్తున్నారు. అసలు చెప్పాలంటే తెలంగాణలో టీడీపీ క్లోజ్ అయిపోయినట్లే...ఆ పార్టీకి ఇంకా ఒక ఎమ్మెల్యే సీటుని కూడా గెలుచుకునే సత్తా కూడా లేదు.

అందుకే ఆ పార్టీకి చెందిన నేతలు చాలామంది ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోయారు. అయితే టీడీపీలో ఇప్పుడు అయిదారుగురు నేతలు ఉంటారు. వారు ఎటు వెళ్లకుండా అలాగే ఉన్నారు. కాకపోతే పార్టీలో కూడా యాక్టివ్‌గా కనిపించడం లేదు. ఇక అలా యాక్టివ్‌గా లేని వారిలో కొత్తకోట దయాకర్ రెడ్డి కూడా ఒకరు. ఈయన మొదట నుంచి టీడీపీలో పనిచేస్తూ వస్తున్నారు. ఎంతమంది పార్టీని వీడిన కూడా, ఈయన పార్టీ వీడలేదు.

కానీ ఇప్పుడు ఆయన కూడా పార్టీ వీడే సమయం వచ్చింది. ఎందుకంటే టీడీపీలో ఉండటం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. ఇక ఈయనని కాంగ్రెస్‌లోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దయాకర్ సైతం టీడీపీని వీడనున్నారని తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాలపై దయాకర్‌కు పట్టు ఉంది. 2009 ఎన్నికల్లో దయాకర్ మక్తల్ ఎమ్మెల్యేగా ఉంటే, దేవరకద్రకు ఆయన భార్య సీతా దయాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు.

ఇప్పుడు వారిని కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చి, రెండిటిల్లో ఏదొక సీటు ఇవ్వాలని రేవంత్ చూస్తున్నారు. పైగా మక్తల్, దేవరకద్రల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతుంది. అలాగే రెండుచోట్ల కాంగ్రెస్‌లో బలమైన నాయకులు లేరు. కాబట్టి దయాకర్ రెడ్డిని తీసుకొస్తే ప్లస్ అవుతుందని రేవంత్ ఆలోచిస్తున్నారు. త్వరలోనే దయాకర్ రెడ్డి, సీతా దయాకర్‌లు హస్తం గూటికి చేరుకొనున్నారని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: