ఇపుడిదే అంశంపై  అధికారపార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మామూలుగా మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు, నేతలు ఎవరైనా సరే సీఎం దృష్టిలో పడాలని కోరుకోవటం సహజం. మరి అదే సీఎం తమ జిల్లాకో లేదా ప్రాంతానికి వచ్చినా కూడా కొందరు గైర్హాజరయ్యాంటే ఏమనుకోవాలి ? అందులోను అలిగిన వాళ్ళు, నిత్యం గొడవలు పడుతున్న ప్రజాప్రతినిధులే కనబడకపోతే ఏమనుకోవాలి ? తమలో తమకు ఎన్ని గొడవలున్నా సీఎం పాల్గొనే కార్యక్రమానికైతే రాకుండా ఉండరు కదా. అలాంటిది అసలు కనబడకపోతే ?




ఈ విషయంలోనే అధికారపార్టీలో చర్చ జరుగుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే గుంటూరులోని ప్రత్తిపాడులో పెన్షన్ పెంపు కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. తమ జిల్లాకు జగన్ వచ్చారు కాబట్టి చాలామంది ప్రజా ప్రతినిధులు పోటీలు పడి మరీ స్వాగతం చెప్పారు. జిల్లా మంత్రి, ఇన్చార్జి మంత్రితో సహా చాలామంది ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు కూడా హాజరయ్యారు. అయితే ఒక ఎంపీ, ఇద్దరు ఎంఎల్ఏలు, మాజీ ఎంఎల్ఏ మాత్రం ఎక్కడా కనబడలేదు.




నరసరావుపేట ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయులు, మాచర్ల ఎంఎల్ఏ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాల ఎంఎల్ఏ కాసు మహేష్ రెడ్డి, మాజీ ఎంఎల్ఏ మర్రి రాజశేఖర్ కార్యక్రమంలో ఎక్కడా కనబడలేదు. ఎంపితో చిలకలూరిపేట ఎంఎల్ఏ విడదల రజనికి ఏ విషయంలో కూడా పడటంలేదు. ఎంపీ ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఎవరు పట్టించుకోవటంలేదు. దాంతో ఎంపీ ఏకంగా సీఎం మీదే అలిగినట్లున్నారు. అలాగే మాజీ ఎంఎల్ఏ మర్రి కూడా సీఎం మీద అలిగారు. తనకు ఎంఎల్సీ ఇస్తానని చెబుతున్నారే కానీ ఇంతవరకు ఇవ్వలేదు. తనకిచ్చిన మాటను జగన్ తప్పారంటు మర్రి బాగా కోపంతో ఉన్నారు.




వాళ్ళ సమస్యల వల్ల వాళ్ళిద్దరు కనబడలేదని అనుకుందాం. మరి మిగిలిన ఇద్దరు ఎంఎల్ఏలకు ఏమైంది ? వీళ్ళకేమీ ఇంటి పోరులేదే. వీళ్ళు కూడా జగన్ పైన దేనికైనా అలిగారా ? లేకపోతే కోపంతో ఉన్నారా ? అన్నదే అర్ధం కావటంలేదు. పార్టీ నేతలకు కూడా ఈ విషయంలోనే క్లారిటి రావటంలేదు. కారణాలు ఏవైనా జగన్ పాల్గొన్న కార్యక్రమానికి ఒక ఎంపీ, ఇద్దరు ఎంఎల్ఏలు గైర్హాజరవ్వటం మామూలు విషయం కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: