బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్టు వ్యవహారం కలకలం రేపుతోంది. కరీంగనర్‌లోని బీజేపీ కార్యాలయంలో జాగరణ దీక్షకు కూర్చున్న బండి సంజయ్ ను అక్రమంగా పోలీసులు అరెస్టు చేశారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణలోని ఉద్యోగుల బదిలీలపై ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోను నిరసిస్తూ బండి సంజయ్‌ జాగరణ దీక్షకు ప్రయత్నించారు. కొవిడ్‌ నిబంధనల వల్ల దీక్షకు అనుమతించలేదన్న పోలీసులు.. అడ్డుకున్న కార్యకర్తలను చెదరగొట్టి బండి సంజయ్‌ను అరెస్టు చేశారు.


బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన తీరుపై ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ అరెస్టు అప్రజాస్వామికమని.. తీవ్రంగా ఖండిస్తున్నామని ఈటల రాజేందర్ అన్నారు. ఉద్యోగుల బదిలీల విషయంలో బండి సంజయ్ చేస్తున్న దీక్షను భగ్నం చేయాలని పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించిన ఈటెల రాజేందర్... బీజేపీ ఆఫీసులో కూర్చుని నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేయడం అప్రజాస్వామికమన్నరాు. బండి సంజయ్, బీజేపీ కార్యకర్తలు శాంతియుతంగా ఉద్యోగులకు మద్దతు తెలుపుతూ జాగరణ చేస్తుంటే ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు.


బండి సంజయ్‌, కార్యకర్తలపై విచక్షణా రహితంగా పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం అమానుషమని..  దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని... ఉద్యోగుల కోసం చేస్తున్న ఆందోళనను అడ్డుకుంటే వారి ఆగ్రహానికి గురికాక తప్పదని ఈటల రాజేందర్‌ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పోలీసులు వ్యవహరించిన తీరును బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా తీవ్రంగా ఖండించారు. మద్యం దుకాణాలు, బార్లకు లేని నిబంధనలు బీజేపీ పార్టీకు మాత్రమే ఉంటాయా అని డీకే అరుణ ప్రశ్నించారు.

తెలంగాణ లో అసలు ప్రజా స్వామ్యం ఉందా.. కోవిడ్ నిబంధనలు కేవలం బీజేపీ కు మాత్రమే వర్తిస్తాయా.. అని ప్రశ్నించిన డీకే అరుణ.. జాతీయ పార్టీ కు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను ఆయన పార్టీ కార్యాలయంలో జాగరణ దీక్ష చేస్తుంటే, అరెస్ట్ చేయడం సిగ్గు చేటన్నారు. బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు, కార్యకర్తల పై పోలీసుల దాడి ఆప్రజాస్వామికంమని.. కేటీఆర్ నల్గొండ జిల్లా పర్యటన, బహిరంగ సభలకు లేని  నిబంధనలు బండి సంజయ్‌ దీక్షకు మాత్రమే ఎలా వర్తిస్తాయని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr