వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి తెలంగాణ రాజ‌కీయాల్లో ఏ పార్టీ త‌న‌కు ప్ర‌ధాన ప్ర‌త్యర్థి కాగ‌ల‌దో టీఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అంచ‌నా వేయ‌లేక‌పోతున్నారా.. అందుకే మ‌రోసారి త‌న‌దైన శైలిలో విప‌క్షాల‌పై దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారా..?  లేక వీటివెనుక ఇంకేదైనా అంతుప‌ట్ట‌ని వ్యూహం దాగి ఉన్న‌దా ఇప్పుడు ఇవే ప్ర‌శ్న‌లు రాజ‌కీయ ప‌రిశీల‌కుల్లో త‌లెత్తుతున్నాయి. తెలంగాణ‌లో క్షేత్ర స్థాయిలో ఉన్న క్యాడ‌ర్ ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే ఇప్ప‌టికీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ పార్టీనే. అందుకే కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చాక ఆ పార్టీని మ‌రింత‌గా బ‌ల‌హీన‌ప‌ర‌చేందుకు శ‌క్తివంచ‌న లేకుండా ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడిగా ఎంపిక‌య్యాక ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ల‌కు వ‌స్తున్న స్పంద‌న చూశాక తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అనుకున్నంత బ‌ల‌హీనంగా ఏమీ లేద‌ని స్ప‌ష్టంగానే తెలిసింది. కేవ‌లం పార్టీలో విభేదాలు, స‌రైన నాయ‌క‌త్వం లేక ఆత్మ‌విశ్వాసం లోపించ‌డ‌మే ఆ పార్టీకి ఇప్ప‌టిదాకా ఉన్న స‌మ‌స్య‌.
 

       ఈ వాస్త‌వాలు అంద‌రికంటే ఎక్కువ‌గా తెలుసుగ‌నుక‌నే ముఖ్య‌మంత్రి కేసీఆర్.. దూకుడుగా వ్య‌వ‌హ‌రించే రేవంత్‌రెడ్డిని మొద‌టినుంచీ నిలువ‌రించేందుకు, ఆయ‌న ప్ర‌జల్లోకి వెళ్ల‌డాన్ని అడ్డుకునేందుకు త‌న శ‌క్తియుక్తుల‌న్నీ వినియోగిస్తూ వ‌చ్చారు. చాలాసార్లు ప‌రిధులు దాటారు కూడా. అయితే ఇదే స‌మ‌యంలో బీజేపీ విష‌యంలో మాత్రం స‌ఖ్య‌త‌ను పాటించేందుకే మొగ్గు చూపుతూ వ‌చ్చారు. బీజేపీ నేత‌లు టీఆర్ఎస్‌పై  ఘాటైన విమ‌ర్శ‌లతో విరుచుకు ప‌డుతున్నా ఇటీవ‌లి కాలం వ‌ర‌కు టీఆర్ఎస్ నుంచి అదే స్థాయి కౌంట‌ర్‌లు ఉండేవి కాదు. కానీ కొద్ది రోజులుగా ప‌రిస్థితి మారిపోయింది. రెండు పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధ‌మే జ‌రుగుతోంది. అంతేకాదు..తాజాగ‌గా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఉన్న బండి సంజ‌య్ స‌భ‌ను అడ్డుకుని, ఆయ‌న‌ను అరెస్టు చేయ‌డానికి కూడా ప్ర‌భుత్వం వెనుకాడ‌లేదు. ఇది దేనికి సంకేతం..?  టీఆర్ఎస్ ఇక‌పై కాంగ్రెస్‌, బీజేపీలను స‌మాన ప్ర‌త్య‌ర్థులుగా ప‌రిగ‌ణిస్తోంద‌నుకోవాలా.. లేక రేవంత్ పై నిర్బంధ వైఖ‌రిని అనుస‌రిస్తూ బీజేపీ నేత‌ల‌ను అడ్డుకోక‌పోతే ప్ర‌జ‌ల్లోకి త‌ప్పుడు సంకేతాలు  వెళతాయ‌ని భావించి ఉంటుందా అన్న‌ది తేలాల్సి ఉంది. ఇప్ప‌టికే కాంగ్రెస్ నేత‌లు టీఆర్ఎస్‌-బీజేపీ మ‌ధ్య కాంగ్రెస్ పార్టీని అడ్డుకునేందుకు ర‌హ‌స్య అవగాహ‌న ఉంద‌ని ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే కేసీఆర్ వ్యూహాలు ఎవ‌రికీ అంతుబ‌ట్ట‌వు. సొంత బ‌లాన్నే న‌మ్ముకుని తిరిగి అధికారంలోకి వ‌చ్చేందుకు మ‌రోసారి ప్ర‌జాక‌ర్ష‌క ప‌థ‌కాల రూప‌క‌ల్ప‌న‌కు ఆయ‌న ఇప్పటికే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. మరి ఈసారి ఆయ‌న ప‌థ‌కాలు ఏమేర‌కు ఫ‌లిస్తాయ‌న్న‌ది ఆస‌క్తిక‌ర‌మే.

మరింత సమాచారం తెలుసుకోండి: