క‌రోనా సృష్టించిన క‌ల్లోలాన్ని మ‌ర‌వ‌క‌ముందే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తోంది. ఈ త‌రుణంలో మ‌రోవైర‌స్ పుట్టుక క‌ల‌క‌లం రేపుతోంది. ఒమిక్రాన్ అంత ప్ర‌మాదక‌ర‌మ‌ని తేలి కాస్త ఊర‌ట చెందే స‌మ‌యంలో `డెమిక్రాన్` అనే వేరియంట్ వెలుగు చూసింది. ఇప్పుడు ఈ వేరియంట్లే కాకుండా ఇజ్రాయెల్‌లో కొత్త వైర‌స్ బ‌య‌ట‌ప‌డింది. దీని పేరు ఫ్లోరోనా.. నిజానికి ఇది క‌రోనాకు కొత్త వేరియంట్ కాద‌ని చెబుతున్నారు. ఒకే స‌మ‌యంలో ఫ్లూ, కొవిడ్‌ల‌కు సంబంధించిన వైర‌స్‌లో శరీరంలోకి చేరి రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ విచ్ఛిన్నం అయి ఈ వైర‌స్ సోకి ఉండ‌చ్చ‌ని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇజ్రాయెల్‌లో తొలి ఫ్లోరోనా కేసు న‌మోద‌యిన‌ట్టు ఆ దేశ ప్ర‌భుత్వం గురువారం మీడియాకు ప్ర‌క‌టించింది.


  ఓ గ‌ర్భిణీకి ఈ వైర‌స్ అటాక్ అయిన‌ట్టు.. ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు వ్యాక్సిన్ వేసుకోలేద‌ని తెలిపింది. గ‌త కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ ఇన్‌ఫ్లూయెంజా పెరుగుతుండ‌డంతో ఈ ఫ్లోరోనా వ్యాపించి ఉండ‌వ‌చ్చంటున్నారు. దీంతో అక్క‌డి ప్ర‌భుత్వం వెంట‌నే అప్ర‌మ‌త్త‌మ‌యి కొత్త వ్యాధిని అరిక‌ట్ట‌డానికి చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇమ్యూనిటిని పెంచుకోవ‌డానికి నాలుగో డోసు కొవిడ్ వ్యాక్సిన్‌ను ప్రారంభించింది. అలాగే, అనారోగ్యంతో ఉన్న వృద్ధుల‌కు కూడా క‌రోనా వ్యాక్సిన్ వేయ‌డానికి అనుమ‌తినిచ్చింది. నాలుగో డోస్‌ను అనుమ‌తించిన తొలిదేశం ఇజ్రాయెల్ అవ‌డం గ‌మ‌నార్హం.


  కాగా, ఇజ్రాయెల్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. తాజా, గ‌ణాంకాల ఆధారంగా గురువారం ఒక్క‌రోజే 5వేల క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అయితే, ప్ర‌పంచంలో తొలిసారిగా వెలుగు చూసిన ఫ్లోరోనా కాస్త ప్ర‌మాదకారి అని అంటున్నారు. ఇది క‌రోనా, ఇన్‌ఫ్లూయెంజా వైర‌స్‌లు ఒకేసారి శ‌రీరంలో ప్ర‌వేశించ‌డం ద్వారా ఏర్ప‌డిన డ‌బుల్ ఇన్ఫెక్ష‌న్ అని చెబుతున్నారు. కొవిడ్ ల‌క్ష‌ణాల‌తో పాటు గుండె కండ‌రాల్లో నొప్పి, మంట వంటి అద‌న‌పు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. న్యుమెనియా, శ్వాస‌కోస స‌మ‌స్య‌ల‌తో పాటు మయ‌కార్డిస్క్‌కు దారితీయొచ్చ‌ని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.  స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే రోగి మృతి చెందే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: