కరోనా మృతుల కుటుంబాలకు 50వేల రూపాయల పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. కరోనాతోనే చనిపోయినట్టు అధికారిక డాక్యుమెంట్, ఇతర ధ్రువీకరణ పత్రాలతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4వేల500 మీసేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవాలని తెలిపింది. డబ్బు అందులో పేర్కొన్న బ్యాంక్ ఖాతాలో పడుతాయని పేర్కొంది.

మరోవైపు విద్యాసంస్థలకు జనవరి 8 నుంచి జనవరి 16వరకు సెలవులు ఇవ్వాలని.. నిన్న సీఎం కేసీఆర్ ఆదేశించారు. నేడు దానికి సంబంధించిన ఉత్తర్వులు విడుదలయ్యాయి. మెడికల్ కాలేజీలు మినహా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ జీవో ఇచ్చింది. గతంలో ఈ నెల 11నుంచి సంక్రాంతి సెలవులు ఇవ్వాలనుకున్నా.. ఒమిక్రాన్ కారణంగా మూడు రోజుల ముందే సెలవులు ప్రకటించారు సీఎం కేసీఆర్.

ఇక రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సమీక్షించిన మంత్రి హరీశ్ రావు.. ఒమిక్రాన్ దృష్ట్యా కోటి హోం ఐసోలేషన్ కిట్లు సిద్ధం చేస్తున్నామన్నారు. రెండు కోట్ల టెస్టింగ్ కిట్లు కూడా రెడీ చేస్తున్నామన్న ఆయన.. వైద్యుల ఖాళీలు భర్తీ చేసే అధికారం కలెక్టర్లకు అప్పగిస్తున్నామన్నారు. అటు కాలేజీలకు వెళ్లి టీనేజర్లకు టీకాలు వేయాలన్న హరీశ్.. కాలేజీ యాజమాన్యాలు కూడా వ్యాక్సినేషన్ పై దృష్టిపెట్టాలని సూచించారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. తాజా పరిస్థితులపై హెల్త్ డైరెక్టర్, డీజీపీ హైకోర్టుకు నివేదిక సమర్పించారు. కొవిడ్ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మరోవైపు కోర్టులు, విద్యాసంస్థలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే దీనిపై విచారణ కోర్టు ఈనెల 7కు వాయిదా వేసింది.


ఇక హైదరాబాద్ బంజారాహిల్స్ పీహెచ్ సీలో 15-18ఏళ్ల మధ్య వారికి టీకా పంపిణీని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. రాష్ట్రంలోని 1014కేంద్రాల్లో పిల్లలకు వ్యాక్సిన్లు ఇస్తున్నట్టు చెప్పారు. తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయుల సమక్షంలో పిల్లలకు వ్యాక్సిన్లు ఇస్తున్నట్టు చెప్పారు. తల్లిదండ్రులు, కాలేజీల యాజమాన్యాలు వ్యాక్సినేషన్ బాధ్యతలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ గుర్తింపు కార్డు లేకపోతే.. కాలేజీ ఐడీ కార్డులతో వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని ఆయన అన్నారు.

 





మరింత సమాచారం తెలుసుకోండి: