భార‌త్‌పై దాడులకు నిరంత‌రం ఉగ్ర‌వాద మూక‌ల‌కు శిక్ష‌ణ ఇస్తూ, అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై విషం కక్కుతూ ఉండే దాయాది దేశం పాకిస్తాన్ ఇప్పుడు అణ్వ‌స్త్ర సామ‌ర్థ్యాన్ని కూడా సంపాదించిన విష‌యం తెలిసిందే. ఆ దేశానికి అణ్వ‌స్త్ర త‌యారీ సాంకేతిక‌త‌ను అంద‌కుండా చేసేందుకు భార‌త‌దేశం దౌత్య మార్గంలో చేసిన కృషి ఫ‌లించ‌లేద‌నే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌తో బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించే భార‌త్‌ను, మ‌తోన్మాదంతో తీవ్ర‌వాద మూక‌ల‌ను పెంచి పోషించే పాక్‌ను ఒకే గాట‌న క‌ట్టేందుకే ఓ రెండు ద‌శాబ్దాల క్రితం వ‌ర‌కు ప‌శ్చిమ దేశాలు ప్ర‌య‌త్నించేవి. అయితే ఇదే స‌మ‌యంలో పాక్ కు అణ్వ‌స్త్ర ర‌హ‌స్యాల‌ను అంద‌కుండా చేసేందుకు ఓ దేశానికి చెందిన‌ గూఢ‌చ‌ర్య సంస్థ మాత్రం శ‌క్తివంచ‌న లేకుండా ప్ర‌య‌త్నించింది. ఆ దేశం ఇజ్రాయెల్‌. ఆ సంస్థ పేరు మొస్సాద్‌. అమెరికాకు చెందిన సీఐఏ, ర‌ష్యాకు చెందిన కేజీబీ, మ‌న దేశానికి చెందిన రా మాదిరిగానే ఆ దేశ ర‌క్ష‌ణ వ్య‌వ‌హారాల్లో దీనిది కీల‌క పాత్ర‌. ప్ర‌పంచంలోనే అత్యంత స‌మ‌ర్థ‌వంత‌మైన నిఘా సంస్థ‌గా దీనికి పేరుంది. మొస్సాద్ పేరు చెపితే శ‌త్రు దేశాలు వ‌ణుకుతాయంటే అతిశ‌యోక్తి కాదు. పాక్ అణు కార్య‌క్ర‌మాన్ని అడ్డుకోవడానికి మొస్సాద్.. ఇజ్రాయెల్ మిత్ర దేశాల‌కు చెందిన కొన్ని కంపెనీల‌ను పేల్చేసేందుకు సైతం వెనుకాడ‌లేద‌న్న విష‌యం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది.

భార‌త్‌తో జ‌రిగిన రెండు యుద్ధాల‌లో ఓడిపోయాక ఎలాగైనా అణ్వ‌స్త్ర దేశంగా ఆవిర్భ‌వించి ఇండియాకు దీటుగా ఎద‌గాల‌ని పంతం ప‌ట్టింది పాకిస్తాన్. ఆ ల‌క్ష్యం నెర‌వేర్చేందుకు ఆ దేశానికి చెందిన అబ్దుల్ ఖాదిర్ అనే శాస్త్ర‌వేత్త 1976లో నెద‌ర్లాండ్స్ దేశం నుంచి ఆ టెక్నాల‌జీకి సంబంధించిన వివ‌రాల‌ను దొంగ‌లించాడు. దీంతో పాక్ అణ్వస్త్ర త‌యారీ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. 1980 ప్రాంతంలో పాక్‌, ఇరాన్‌లు సంయుక్తంగా అణుబాంబు త‌యారీ కోసం కృషి చేస్తున్నాయ‌ని అనుమానించిన ఇజ్రాయెల్ ఆ కార్య‌క్ర‌మాన్ని అడ్డుకునేందుకు మొస్సాద్ ఏజెంట్ల‌ను రంగంలోకి దించింది. పాక్ ఇచ్చే సొమ్ము కోసం ఆశ‌ప‌డి ఆ దేశానికి స‌హ‌క‌రిస్తున్న‌ ప‌శ్చిమ జ‌ర్మనీకి చెందిన బాన్‌, స్విడ్జ‌ర్లాండ్ కు చెందిన బెర్న్ స‌హా మ‌రికొన్ని కంపెనీల‌ను ముందుగా హెచ్చ‌రించిన మొస్సాద్ అవి మాట విన‌క‌పోవ‌డంతో ఆ సంస్థ‌ల‌కు చెందిన ఫ్యాక్ట‌రీలపై బాంబు దాడుల‌కు పాల్ప‌డింది. ఆ రెండు దేశాల‌తోనూ నిజానికి ఇజ్రాయెల్‌కు మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే అప్ప‌టికే ఆల‌స్యం కావ‌డంతో ఆ కంపెనీల నుంచి అణు ప‌రిక‌రాల‌ను పాక్ సంపాదించ‌గ‌లిగింది. ఇక గ‌త ఏడాది ఇరాన్‌కు చెందిన ఓ ప్ర‌ముఖ అణుశాస్త్ర‌వేత్త‌ను మొస్సాద్ ఆ దేశంలోనే దాడి చేసి హ‌త‌మార్చిన విష‌యం తెలిసిందే. 1976లో పాల‌స్తీనా లిబ‌రేష‌న్ ఫ్రంట్‌కు చెందిన తీవ్ర‌వాదులు ఓ ఇజ్రాయెల్ విమానాన్ని హైజాక్ చేసి ఆఫ్రికా దేశ‌మైన ఉగాండాలో దించి బ్లాక్‌మెయిల్ చేశారు. అప్ప‌ట్లో ఆ విమానంలో ఉన్న 248 మంది ప్ర‌యాణికుల‌ను కాపాడేందుకు మొస్సాద్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ థండ‌ర్ బోల్ట్ గురించి వింటేనే రోమాలు నిక్క‌బొడుచుకుంటాయి. ఆ తీవ్రవాదుల బారినుంచి ప్ర‌యాణికుల‌ను ర‌క్షించి మొస్సాద్ ఏజెంట్లు సుర‌క్షితంగా స్వదేశానికి చేర్చారు. ఇక మ‌న‌దేశానికి ర‌క్ష‌ణ‌ప‌రంగా ఇజ్రాయెల్ ప‌లుర‌కాల స‌హ‌కారం అందిస్తున్న విష‌యం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: