కాలం మారుతోంది. మారుతున్న కాలంతో పాటు విలువలు కూడా మారుతున్నాయి. అన్ని రంగాల్లోనూ విలువలు దిగజారుతూనే ఉన్నాయి. ఇక రాజకీయం విషయంలో ఆ విలువలు మరీ పాతాళానికి పడిపోతున్నాయి. రాజకీయాల్లో విమర్శలు సహజం.. అయితే ఆ విమర్శలు ఎప్పుడూ రాజకీయంగానే ఉండాలి.. విమర్శలు వ్యక్తిగతం కాకూడదు..ఇది ఎప్పటి నుంచో నేతలు పాటిస్తున్న అప్రకటిత నియమం.. కానీ.. ఇప్పుడు రోజులు మారిపోయాయి.. విద్వేష రాజకీయాలకు ప్రాధాన్యం లభిస్తోంది.


వీలైనంత తిట్టు.. వీలైనంత బూతులు తిట్టు.. అప్పుడే నీకు గుర్తింపు వస్తుంది అన్న ధోరణి క్రమంగా పెరిగిపోతోంది. గతంలో నేతలు ఎలాంటి వారైనా వారి వ్యక్తిగత అలవాట్ల విషయాలు పెద్దగా ప్రస్తావించేవారు కాదు. రాజకీయంగా సిద్ధాంతాలు.. తీసుకున్న నిర్ణయాలు.. అనుసరిస్తున్న విధానాల పరంగా విమర్శలు ఉండేవి.. ఇప్పుడు నేరుగా నువ్వు దోచుకున్నావు.. నువ్వు దొంగవు అంటూ తిట్టుకునే పరిస్థితి వచ్చింది. వచ్చింది సరే.. అక్కడితో ఆగుతుందా.. అదీ లేదు.. ఇప్పుడు ఏకంగా నేతల వ్యక్తిగత వ్యసనాలపైనా వ్యాఖ్యలు వస్తున్నాయి.


తెలంగాణ సీఎం కేసీఆర్‌ విపరీతంగా మద్యం తాగుతారని గతంలో ఓ ప్రచారం ఉండేది. విపరీతంగా  మద్యం తాగుతారో లేదో తెలియదు కానీ.. తనకు మద్యం అలవాటు ఉందని.. వైద్యుడు చెప్పిన తర్వాత ఆ అలవాటు ఇప్పుడు మానేశానని కేసీఆరే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ ఇప్పుడు కొందరు నేతలు డైరెక్టుగా కేసీఆర్ తాగుడుపైనే విమర్శలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు.. తాము అధికారంలోకి వస్తే రూ. 70 రూపాయలకే చీప్‌ లిక్కర్ ఇస్తామని హామీ ఇచ్చారు.


ఆ హామీని కేటీఆర్ విమర్శిస్తే.. దానికి సమాధానం చెప్పలేక సోము వీర్రాజు కేసీఆర్ తాగుడు అలవాటుపై వ్యాఖ్యలు చేశారు. ఏం.. కేసీఆర్‌ రాత్రి 3 గంటల వరకూ తాగుతాడు కదా.. మీరుమాకు చెబుతారా అని ప్రశ్నించారు. తాజాగా బండి సంజయ్‌ కూడా అంతే.. జైలు నుంచి విడుదలైన బండి సంజయ్‌.. నాకు జైల్లో ఉండటం ఇబ్బందేమీ లేదు.. నాకేమీ నీలా తాగుడు అలవాటు లేదు కదా అంటూ ఎద్దేవా చేశారు. ఇలా నేరుగా నేతల వ్యక్తిగత అలవాట్లపై బహిరంగ వ్యాఖ్యలు చేయడం కూడా సాధారణంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: