ఊహించిన‌ట్టుగానే పంజాబ్‌లో ప్ర‌ధాని మోదీని ఆందోళ‌న‌కారులు అడ్డుకున్న ఘ‌ట‌నపై జాతీయ స్థాయిలో ర‌చ్చ జ‌రుగుతోంది. రాజ‌కీయ రంగు పులుముకుంటోంది. త‌న‌ను ఎదిరించిన‌వారి సంగ‌తి చూసేదాకా వ‌ద‌ల‌ని మోదీ ఇప్పుడు పంజాబ్ కాంగ్రెస్ నేత‌ల‌పై కూడా అదే స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న‌ట్టు ఆ పార్టీ వ‌ర్గాల స్పంద‌న సూచిస్తోంది. ప్ర‌ధాని మోదీ సైతం తను ప్రాణాల‌తో తిరిగిరావ‌డానికి స‌హ‌క‌రించిన మీ ముఖ్య‌మంత్రికి కృత‌జ్ఞ‌త‌లు అంటూ వ్యంగ్యం, ఆగ్ర‌హం క‌ల‌బోసి ఎయిర్‌పోర్టులో పంజాబ్ పోలీసుల‌తో వ్యాఖ్యానించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంలో విఫ‌ల‌మైన పంజాబ్ ముఖ్య‌మంత్రి చన్నీ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని బీజేపీ నాయ‌కులు డిమాండ్ చేస్తున్నారు. 43,000 కోట్ల‌కు పైగా విలువైన అభివృద్ది కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించేందుకు ప్ర‌ధాని మోదీ ఆ రాష్ట్ర పర్య‌ట‌న‌కు వెళ్లార‌ని, కానీ కాంగ్రెస్ ప్ర‌భుత్వం కావాల‌నే వాటిని అడ్డుకుంద‌ని బీజేపీ విమ‌ర్శిస్తోంది. హోం మంత్రి అమిత్ షా కూడా పంజాబ్ ఘ‌ట‌న‌పై నిప్పులు చెరిగారు.

ఇదే స‌మ‌యంలో భ‌ద్ర‌తా లోపాల కారణంగానే పంజాబ్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని ఇబ్బందులు ప‌డాల్సివ‌చ్చింద‌ని, ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నార‌ని వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను పంజాబ్ ప్ర‌భుత్వం మాత్రం తేలిగ్గా కొట్టిపారేసింది.ఫిరోజ్‌పూర్‌లో ప్ర‌ధాని పాల్గొనాల్సిన ఎన్నిక‌ల స‌భ‌కు అస‌లు జ‌నాలే రాలేద‌ని, అది క‌ప్పిపుచ్చుకోవ‌డానికే ప్ర‌ధాని మోదీ నెపాన్ని త‌మ ప్ర‌భుత్వంపై నెట్టి వెన‌క్కు వెళ్లిపోయార‌ని కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది. అయితే ప్ర‌ధాని రోడ్డు మార్గంలో వెళ్లాల‌ని ముందుగా అనుకోలేద‌ని, అప్ప‌టిక‌ప్పుడు తీసుకున్న నిర్ణ‌య‌మ‌ని, మ‌రి ప్ర‌ధాని ప‌య‌నించే మార్గం రాష్ట్ర ప్ర‌భుత్వ వ‌ర్గాల‌కు సంబంధం లేకుండా ఆందోళ‌న కారుల‌కు ఎలా తెలిసింద‌ని బీజేపీ ప్ర‌శ్నిస్తోంది. మ‌రోప‌క్క ఇటీవ‌ల ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌ఖింపూర్‌ఖేరీ ఘ‌ట‌న‌లో బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు ఆ గ్రామానికి వెళ్లిన ప్రియాంక గాంధీని అక్క‌డి ఆదిత్య‌నాథ్ యోగి ప్ర‌భుత్వం అడుగ‌డుగునా పోలీసుల‌తో అడ్డుకుని, ఆమెను హౌస్ అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టిన విష‌యం తెలిసిందే.  ఈ కార‌ణాల‌తో బీజేపీపై ప్ర‌తీకారం తీర్చుకోవ‌డ‌మే పంజాబ్ ఘ‌ట‌న‌కు నేప‌థ్య‌మా అన్న అభిప్రాయాలూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మొత్తంమీద మోదీని పంజాబ్ లో ప‌ర్య‌టించ‌నివ్వ‌కుండా చేయ‌డానికి కార‌ణ‌మెవ‌రైనా గానీ బీజేపీకి ఓ ఎన్నిక‌ల అంశం మాత్రం అందించిన‌ట్టైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: